సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి

సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు.  సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి వీకే సింగ్ పర్యటించారు. జిల్లాలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సూర్యాపేట సెంటర్లోని సంతోష్ బాబు  విగ్రహం వద్దకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి వీకే సింగ్.

రెండేళ్ల క్రితం 2020 జూన్ 15న భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.  అమరుడైన సంతోష్ బాబుకు కేంద్రం మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా అందించే ఈ అవార్డును సంతోష్ బాబు తల్లి, సతీమణి రాష్ట్రపతి కోవింద్ మహావీర చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. సంతోష్ బాబు సతీమణి గ్రూప్ 1 ఉద్యోగం పొంది.. సూర్యాపేటకు పొరుగున ఉన్న యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. 
అసమాన ధైర్య సాహసాలతో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించిన సంతోష్ బాబు 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. సంతోష్ బాబు ధైర్య సాహసాలు స్ఫూర్తి కలిగించేలా రూపొందించిన ఈ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఏడాదిలోపే విగ్రహావిష్కరణ పూర్తయింది. 
భారత జవాన్ల వీరత్వాన్ని చాటిన సంతోష్ బాబు ఇంటికి కేంద్ర మంత్రి వీకే సింగ్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాదు.. కుటుంబ సభ్యులతో కలసి ఆయన విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించారు. కార్యక్రమంలో  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.