‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి ఆయన హైదరాబాద్ కు రానున్నారు. పాతబస్తీలో రెండు రోజుల పాటు సింధియా పర్యటన కొనసాగనుంది. కార్యకర్తలు, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలతో ఆయన భేటీ కానున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, గోషా మహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో సింధియా పర్యటన కొనసాగనుంది. సమావేశాలు, పర్యటనల అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ లో సింధియా బస చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఏమిటీ ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ ?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకొనే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎనిమిదేళ్ల కాలంలో ఎన్డీయే ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని నిర్ణయించింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆ పథకాలను ఆయా రాష్ట్రాలు క్రెడిట్ చేసుకుంటున్నాయనే ఉద్దేశం కేంద్ర సర్కారులో నెలకొంది. ఇలాంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ఆయా రాష్ట్రాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను పంపేందుకు అమలుచేస్తున్న కార్యక్రమమే ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’. దీని ద్వారా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ లో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కింద కేంద్ర మంత్రులను ఒక్కో నియోజకవర్గానికి ఒక ‘ప్రవాస్ మంత్రి’గా కేటాయించింది. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించారు.
