మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. థానేలో మాత్రే ఫ్యామిలీ ట్రిపుల్ విక్టరీ

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. థానేలో మాత్రే ఫ్యామిలీ ట్రిపుల్ విక్టరీ

ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఘటన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ మాత్రే కుటుంబానికి కంచుకోట. గత కొన్నేండ్లుగా మాత్రే ఫ్యామిలీ ఇక్కడ రాజకీయాలను శాసిస్తోంది. 

ఏ పార్టీలో ఉన్న వారిదే విజయం. తాజాగా జరిగిన థానే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది మరోసారి రుజువైంది. 2026, జనవరి 15న జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రే కుటుంబం నుంచి ముగ్గురు బరిలోకి దిగారు. ముగ్గురు కూడా మూడు వేర్వేరు వార్డులు, వేర్వేరు పార్టీల తరుఫున పోటీ చేశారు. 

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అభ్యర్థిగా ప్రహ్లాద్ మాత్రే, శివసేన టికెట్‌పై రేఖ మాత్రే, బీజేపీ తరుఫున రవీన్ మాత్రే బరిలోకి దిగారు. ఆయా వార్డుల్లో వీరు ముగ్గురు ఘన విజయం సాధించారు. మాత్రే ఫ్యామిలీ ట్రిపుల్ విక్టరీ మరోసారి వంశపారపర్య రాజకీయాలపై చర్చకు దారి తీసింది. మహారాష్ట్రలో వంశపారంపర్య రాజకీయాలు లోతైన వేళ్ళూనుకున్నాయనడానికి ఇదే నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Also Read : డ్యూటీ టైం అయిపోయిందని పైలట్ ఎస్కేప్.. తలుపులు తన్నిన ప్రయాణికులు!

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. శుక్రవారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 23 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఎన్డీఏ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి అధిక్యంలో దూసుకుపోతుంది. 

దేశ ఆర్థిక రాజధాని ముంబయి సివిక్ బాడీ బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‎లో అధికార బీజేపీ కూటమి మ్యాజిక్ (114) దాటింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అధికార మహాయుతి కూటమి అధిక్యంలో ఉంది. థాక్రే బ్రదర్స్ కలయిక ముంబైలో కాస్త ప్రభావం చూపిన మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఓట్లు రాబట్టలేకపోయింది. కాగా, మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు 2026, జనవరి 15న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.15,931 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.