ముంబై నుండి థాయ్‌లాండ్‌లోని క్రాబీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో గురువారం పెద్ద గొడవ జరిగింది. డ్యూటీ టైం అయిపోయిందని పైలట్ విమానం నడపడానికి నిరాకరించడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే :ఉదయం 4:05 గంటలకు బయలుదేరాల్సిన విమానం (6E 1085) మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. పైలట్ రాకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు విమాన సిబ్బందితో గొడవకి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మా ప్లాన్స్ అన్నీ ఏమైపోవాలి? పైలట్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఒక ప్రయాణికుడు సిబ్బందిని నిలదీశారు. కోపం తట్టుకోలేక ఓ ప్రయాణికుడు విమానం బయటకు వెళ్లే తలుపును బలంగా తన్నడం వీడియోలో చూడొచ్చు.
ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ వేరే విమానాలు ఆలస్యంగా రావడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల పైలట్ల డ్యూటీ టైం అయిపోయిందని, అందుకే వారు విమానం నడపలేకపోయారు.
విమానంలో ఇద్దరు ప్రయాణికులు చాలా అసభ్యంగా ప్రవర్తించారని, అందుకే వారిని విమానం నుండి దించేసి సెక్యూరిటీకి అప్పగించామని సంస్థ తెలిపింది. దీనివల్ల విమానం మరింత ఆలస్యమైంది.
ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని వారికి ఫుడ్, డ్రింక్స్ ఇచ్చామని ఇండిగో చెప్పింది. చివరకు ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సిన విమానం, మధ్యాహ్నం 1 గంటకు క్రాబీ చేరుకుంది.
