
మహబూబ్‌నగర్, వెలుగు : వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 2008-–09 నుంచి డ్యూటీలు చేస్తున్నా, తమను రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్సర్కారు 2016లో జీవో 16 ప్రకారం పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని, ఏడేండ్లు కావొస్తున్నా రెగ్యులరైజ్ చేయడం లేదని నిరసన తెలుపుతున్నారు.
రోజూ గంట పాటు నిరసన
2008--–09 నుంచి రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి సుమారు1,500 మంది వరకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. ఇందులో కొందరు చనిపోగా, మరో వంద మంది వరకు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం 1,335 మంది డ్యూటీలు చేస్తున్నారు. వీరిలో ఉస్మానియా యూనివర్సిటీలో 370 మంది, కాకతీయ యూనివర్సిటీ182, జేఎన్టీయూలో 265, తెలంగాణ వర్సిటీలో 52, మహాత్మాగాంధీ వర్సిటీలో 49, పాలమూరులో 100, శాతవాహనలో 39, తెలుగు యూనివర్సిటీలో 22, జేఎన్ఎఫ్ఏయూలో 99, అంబేద్కర్ వర్సిటీలో 22, రాజీవ్ గాంధీ వర్సిటీలో 136 మంది పని చేస్తున్నారు. వీరంతా తమను పర్మినెంట్ చేయాలని 21 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో గంట పాటు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
పీఆర్సీ అమలు చేయట్లే..
వర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సర్వీసు ఆధారంగా రూ.34 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. కానీ, రాష్ర్ట ప్రభుత్వం వీరికి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం లేదు. హయ్యర్‌ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద వర్క్ చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, గురుకులాల్లో పని చేస్తున్న వారికి 30 శాతం పీఆర్సీని వర్తింపజేస్తున్నా.. వీరిపై వివక్ష చూపుతున్నారు. దీంతో ఏండ్లు కావొస్తున్నా.. ఇంక్రిమెంట్లు పడడం లేదు.
జీవో 16 ప్రకారం రెగ్యులరైజ్ చేయండి
కొద్ది రోజుల కింద రాష్ర్ట ప్రభుత్వం హయ్యర్‌ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పని చేస్తున్న దాదాపు నాలుగు వేల మందిని జీవో 16 ప్రకారం రెగ్యులరైజ్ చేసింది. ఇందులో జూనియర్ లెక్చరర్లు మూడు వేల మంది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు 270 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్లు 400 మంది ఉన్నారు. వీరితో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరో వెయ్యి మందిని ఇదే జీవో ఆధారంగా రెగ్యులరైజ్ చేసింది. అయితే, తమను కూడా జీవో 16 ప్రకారం పర్మినెంట్ చేయాలని వర్సిటీ కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు. 15 ఏండ్లుగా తాము డ్యూటీలు చేస్తున్నామని, కొందరైతే రిటైర్మెంట్కు దగ్గరయ్యారని చెప్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయకపోతే ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేస్తున్నారు.
నా దగ్గర చదువుకున్న వారికి పర్మినెంట్ అయ్యింది
2008లో కొత్త యూనివర్సిటీలు వచ్చాయి. 2009లో నేను పాలమూరు యూనివర్సిటీలో ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ జాబ్‌కు సెలెక్ట్ అయ్యా. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, వార్డెన్‌గా, కో ఆర్డినేటర్‌గా జాబ్ చేస్తున్నా. నేను చదువు చెప్పిన స్టూడెంట్లు ఇప్పుడు జేఎల్, డీఎల్లుగా రెగ్యులర్ అయ్యారు. నేను కాలేదు.
- వంగరి భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
15 ఏండ్లుగా పని చేస్తున్నా..
2008 నుంచి నేను యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నా. తెలంగాణ వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని అనుకున్నాం. తొమ్మిదేండ్లు అయినా చేయలేదు. మేం డ్యూటీల్లో చేరి 15 ఏండ్లు అవుతోంది. ఎదురుచూపులు తప్పట్లేదు
- రవికాంత్, కాంట్రాక్ట్ అసిస్టెంట్‌ప్రొఫెసర్, పాలమూరు యూనివర్సిటీ