
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి లష్కరే తాయిబా అనుబంధ టెర్రర్ గ్రూప్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) రెండుసార్లు బాధ్యత వహించిందని, దాడి జరిగిన ప్రదేశం ఫొటోలను కూడా విడుదల చేసిందని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్(యూఎన్‌ఎస్‌సీ)కి చెందిన ఆంక్షల పర్యవేక్షణ బృందం వెల్లడించింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తాయిబా మద్దతు లేకుంటే పహల్గాం దాడి జరిగేదే కాదని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడిపై యూఎన్ఎస్సీ అనలిటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ (ఎంటీ) నివేదికను తయారు చేసింది.
ఈ రిపోర్టును యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీకి అప్పగించింది. పహల్గాం దాడిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్ర ఉన్నట్లు మొదటిసారిగా నివేదికలో ప్రస్తావించారు. లష్కరే- తాయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ మధ్య సంబంధం ఉందని నివేదిక వెల్లడించింది. పహల్గాం దాడిలో ఐదుగురు టెర్రరిస్టులు పాల్గొన్నారని..26 మంది మరణించారని తెలిపింది.