ప్రస్తుతమంతా టెక్నాలజీ యుగం. మనుషులు రాకెట్లలో అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అంతరిక్షంలో మానవ నివాసాలకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలు వీడటం లేదు. సెంటిమెంట్లను పాటించడం మానడం లేదు. అమావాస్య రాత్రి బయట తిరగొద్దు.. గ్రహణం రోజు గర్భిణీలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దు వంటి మూఢ నమ్మకాలను ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు.
2026, జనవరి 18వ తేదీన ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లారు. పండగ సెలవులు ముగియడంతో తిరిగి పట్నం బాట పట్టారు. కానీ ఆదివారం (జనవరి 18) మౌని అమావాస్య కావడంతో చాలా మంది సొంతూరు విడిచి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అమావాస్య వేళ ప్రయాణాలు మంచిది కాదని జర్నీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. దీంతో సాధారణంగా పండుగ సీజన్లో వాహనాల రద్దీతో కనిపించే విజయవాడ-హైదరాబాద్ హైవేపై వెహికల్ ఫ్లో మూములుగా ఉండటం గమనార్హం.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. గత అర్థరాత్రి వరకు దాదాపు 70 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు సమాచారం. సంక్రాంతి పండగ ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన ఏపీ వాసులు హైదరాబాద్ పట్టడంతో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్ 65) పై వాహనాల రద్దీ నెలకొంది.
అయితే.. ఆదివారం (జనవరి 18) మౌని అమావాస్య కావడంతో ఊర్లో నుండి బయటకు వెళ్లడానికి ఆంధ్రా వాసులు ఆసక్తి చూపడం లేదు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ మూములుగానే ఉంది. ఏపీ నుంచి జనం పెద్ద ఎత్తున సిటీకి వచ్చే అవకాశం ఉండటంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం 16 బూత్‌లకు గాను హైదరాబాదు వైపు 9 బూత్‌లను తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది.
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా:
విజయవాడ-హైదరాబాద్ రూట్లో వాహనాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ డైవర్షన్స్ చేపడుతున్నారు పోలీసులు. జాతీయ రహదారి 65 పై చిట్యాల వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో ట్రాఫిక్ అంతరాయం మరింతగా పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
రద్దీని తగ్గించడానికి మూడు లైన్లలో వాహనాల మళ్లింపు చేపట్టారు పోలీసులు. పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని కోదాడ, నల్లగొండ బైపాస్ వద్ద దారి మళ్లించారు. కచ్చ రోడ్డుపై వాహనాలను పంపడంతో తీవ్రంగా దుమ్ము లేస్తుంది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
