ఆగని కలప అక్రమ రవాణా!.. అటవీ శాఖలో మళ్లీ ఇంటి దొంగల హల్ చల్

ఆగని కలప అక్రమ రవాణా!.. అటవీ శాఖలో మళ్లీ ఇంటి దొంగల హల్ చల్
  • ఆగని కలప అక్రమ రవాణా!
  • అటవీ శాఖలో మళ్లీ ఇంటి దొంగల హల్ చల్ 
  • ఎన్​ఓసీ, బిల్లులు లేకుండానే తరలుతున్న టేకు
  • సామిల్ యజమానిపై కేసు లేకుండా తప్పించే యత్నం
  • సామిల్లులో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు
  • మూడు జిల్లాల పరిధిలో పెత్తనం చేస్తున్న ఓ ఆఫీసర్!​

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు: ఖమ్మం జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగల బాగోతం మరోసారి బయటపడింది. ఇటీవల ఫేక్​ పర్మిట్లతో కోట్ల విలువైన సండ్ర దుంగల తరలింపు వ్యవహారం మర్చిపోక ముందే, ఎలాంటి బిల్లులు లేకుండా టేకు కలప తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. పర్మిట్, నో ఆబ్జెక్షన్​సర్టిఫికెట్ లేకుండా ఆటోలో దాదాపు రూ.40 వేల విలువైన టేకు కలపను తరలిస్తుండగా, కామేపల్లి మండలం ముచ్చర్లలో బుధవారం రాత్రి కారేపల్లి ఫారెస్ట్ రేంజ్​ సిబ్బంది పట్టుకున్నారు. 

కారేపల్లి మండలం రామోజీతండాకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి జీరో బిల్లుపై ఖమ్మం నగరం కైకొండాయిగూడెంలో ఉన్న మదార్​ సామిల్లు నుంచి తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు. ఎన్​వోసీ, ఇతర పేపర్లు లేకపోవడంతో ఆటోను, కలపను సీజ్​ చేశారు.

రికార్డుల ప్రకారం సామిల్లు స్టాక్​ లో ఆ కలప ఉందా, లేదా తేల్చేందుకు గురువారం డీఆర్వో సాల్మన్​ రాజ్​ ఆధ్వర్యంలో రోజంతా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఎన్​వోసీ లేకుండానే టేకు కలపను అమ్మినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామిల్లు యజమాని సత్యనారాయణ మాత్రం తాను ఎలాంటి కలప అమ్మలేదని చెబుతున్నాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరూ లేనిది చూసి, తన సామిల్లులో టేకు కలపను చోరీ చేసి తీసుకెళ్లారంటూ గురువారం ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే కలప అక్రమ రవాణాకు చెక్​ పెట్టేందుకు ప్రతీ సామిల్లు దగ్గర సీసీ కెమెరాను ఫారెస్ట్ అధికారులు తప్పనిసరి చేయగా, మదార్​ సామిల్లు దగ్గర సీసీ కెమెరా పనిచేయడం లేదని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మామూళ్ల తో అక్రమాలకు సహకారం..!

నిబంధనల ప్రకారం అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా కలప నరికి, అక్రమ రవాణా జరిగితే సంబంధిత ఫారెస్ట్ సిబ్బంది సస్పెండ్ అవుతారు. సామిల్లు నుంచి అనుమతి లేకుండా కలప బయటకు వెళ్తే ఆ సామిల్లును సీజ్​ చేస్తారు. బుధవారం పట్టుకున్న టేకు కలపను కైకొండాయిగూడెం సామిల్లు నుంచి కొని తీసుకెళ్తున్నానని ఆటోలో తరలిస్తున్న లక్ష్మణ్​ చెబుతుండగా, తాను అమ్మకుండానే దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడని సామిల్లు ఓనర్​ సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సామిల్లుల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకునే ఆఫీసర్​ ఒకరు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. 

సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెనుక కూడా ఇలాంటి అక్రమ వ్యవహారాలే కారణమని ప్రచారం జరుగుతోంది. సామిల్లు సీజ్​చేసే పరిస్థితి రాకుండా ఆయన ఇచ్చిన సలహా మేరకే దొంగతనం కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల సండ్ర కలప తరలింపు వ్యవహారంలో సీజ్​ చేసిన ఫోన్​ లోని ఆన్ లైన్​ పేమెంట్స్​ లో కూడా సదరు అధికారి కొన్న కారు ఈఎంఐల కోసం నగదు బదిలీ చేసిన ఆధారాలున్నాయని విశ్వసనీయ సమాచారం. 

మరోవైపు రెండు వారాల కింద కూడా ఖమ్మం రేంజ్​ పరిధిలోని అదే అధికారి ఓ ట్రాక్టర్​ కలప అక్రమ రవాణాకు సహకరించబోయి భంగపడినట్టు తెలుస్తోంది. తనకు రెగ్యులర్​ గా మామూళ్లు ఇచ్చే ఓ వ్యక్తి ట్రాక్టర్​ లో కలపను ఖమ్మం తీసుకువస్తున్నారు. 

మంచుకొండ వరకు మేనేజ్​ చేసుకొని వస్తే ఇక్కడ తాను చూసుకుంటానంటూ ఆ అధికారి మాట ఇచ్చారు. అన్నట్టుగానే ఎన్టీపీఎస్​ ద్వారా ఆ ట్రాక్టర్​ నెంబర్​ తో ఎన్​వోసీ కూడా తీసుకున్నారు. కానీ మంచుకొండకు వచ్చే దారిలోనే ట్రాక్టర్​ ను కారేపల్లి రేంజ్​ పరిధి సిబ్బంది పండితాపురంలో ​పట్టుకున్నారు. ఎలాంటి పేపర్లు లేకపోవడంతో అక్కడే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 

పట్టుబడిన టేకు కలపపై ఎంక్వైరీ చేస్తున్నాం

ముచ్చర్లలో ఆటోలో టేకు కలప తరలింపుపై ఎంక్వైరీ జరుగుతోంది. ఖమ్మం, కారేపల్లి రేంజర్లు దర్యాప్తు చేస్తున్నారు. సామిల్లులోని రికార్డులు, అక్కడ ఉన్న టేకు కలప స్టాక్​ ను లెక్క చూస్తున్నాం. సామిల్లు దగ్గర సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఆ రూట్ లో ఉన్న ఇతర సీసీ కెమెరాలు, ఇతర షాపుల ముందు సీసీ ఫుటేజీని పోలీసుల సహకారంతో పరిశీలిస్తాం. ఫారెస్ట్ సిబ్బంది ప్రమేయముంటే చర్యలు తీసుకుంటాం. - సిద్ధార్థ్ విక్రమ్​ సింగ్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి

సెటిల్​మెంట్ కుదరకపోవడంతో..!

టేకు కలప తరలిస్తున్న ఆటో వ్యవహారంలో అటవీ శాఖలో ఖమ్మం జిల్లాకు సంబంధం లేని ఓ ఆఫీసర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మణుగూరు ఫారెస్ట్ డివిజన్​ పరిధిలో మహబూబాబాద్​ జిల్లాలో రేంజర్​ పనిచేస్తున్న ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇన్​చార్జి రేంజర్​ గా వ్యవహరిస్తున్నారు. బుధవారం కామేపల్లి మండలం ముచ్చర్లలో ఆటోలో టేకు కలప తీసుకెళ్తున్న విషయాన్ని చూసిన ఆయన, ఆటోను ఆపారు. తన డ్యూటీ పరిధి కాకపోయినా ఎన్​ఓసీ పేపర్లు చూపించాలంటూ కాసేపు హడావుడి చేశారు. 

కలప కొన్న వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని సెటిల్​మెంట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ లోగానే కామేపల్లికి చెందిన ఓ సామిల్ యాజమాని ఒకరు ఆటో దగ్గరకు వచ్చి, ఏం జరుగుతుందా అని ఆరాతీశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కారేపల్లి రేంజ్​ సిబ్బందికి సమాచారమిచ్చిన పక్కన జిల్లా అధికారి, అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. 

తన పరిధి కాకున్నా ఖమ్మం జిల్లా పరిధిలో కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాలకు చెందిన రేంజర్​ స్థాయి అధికారి చేసిన హడావుడిపై అటవీశాఖలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. వసూళ్ల కోసమే ఆయన బరితెగించి, జిల్లా సరిహద్దులు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కొందరు ఆయనపై మండిపడుతున్నారు.