పగబట్టిన ప్రకృతి.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల బీభత్సం

పగబట్టిన ప్రకృతి.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల బీభత్సం

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాలో బలమైన ఈదురుగాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పంటలు ధ్వంసమై రైతులు లబోదిబోమంటున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి.

ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. ఈదురుగాలులతో మిరప, నిమ్మ తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి కాయలూ నేలరాలిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానలు దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. 

* జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ లోని వరి కొనుగోలు కేంద్రంలో వడగండ్ల వాన కురవడంతో వరి ధాన్యం తడిసింది. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో రాళ్ల వర్షం కురిసింది. కొడిమ్యాల మండలంతో పాటు కొండాపూర్ గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. 

* రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఈదురు గాలులతో కూడిన రాళ్ల భారీ వర్షం కురిసింది. దీంతో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. గంట సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 
చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

* కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది. 

* ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

* ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

* నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 
భారీ వర్షానికి ప్రైవేటు ఇంటర్నెట్ టవర్ నేలకొరిగింది. వర్షానికి మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసిపోయింది. 15 రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం కొనాలని రైతులు పడిగాపులు కాస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఏప్రిల్ 30న అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఆకాల వర్షంలో ధాన్యం తడిసిపోయింది. 

* హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పరకాల, దామరలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కళ్లాల్లో అర బోసిన ధాన్యం తడిసిపోయింది. 

* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తరం, మలహార్, పలిమేల మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 

* యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో భారీ ఈదురు గాలులకు మోత్కూరు, రాయిగిరి ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.