పలు జిల్లాల్లో భారీ వర్షం

పలు జిల్లాల్లో భారీ వర్షం

రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లా కొటెపల్లిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కాసులాబాద్ లో 6 సెంటిమీటర్లు, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో 5 సెంటిమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఇటు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దాదాపు గంట సేపు నాన్ స్టాప్ గా పడిన గాలి వానకు చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు పడుతాయని వాతావరణశాఖ చెప్పింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది.

తడిసిపోయిన ధాన్యం : -
అకాల వర్షంతో నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం తడిసిపోయింది. అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులు... ఇంటి నుంచి తెచ్చుకున్న కవర్లతో వడ్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 5 రోజులుగా ధాన్యాన్ని ఎండబెట్టామని, తూకం వేసే సమయానికి వర్షం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.  మెదక్ జిల్లాలో పలు చోట్ల రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట, గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. పంటలు చేతికొచ్చి రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం సేకరించడం లేదని రైతులు ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ లో రైతులు నిరసనకు దిగారు.

రైతుల ధర్నాలు.. నిరసనలు : -
సిద్ధిపేట- కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా ప్రగతి ధర్మారంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు సెంటర్ల దగ్గర ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయంటున్నారు రైతులు. లారీల నుంచి ధాన్యాన్ని అన్ లోడ్ చేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయంటూ నిజామాబాద్ జిల్లా భీంగల్ లో పురానీపేట్ రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కోనుగోళ్లలో వేగం పెంచుతామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. 

మరిన్ని వార్తల కోసం : -

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన


ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం