తెలంగాణలో అకాల వర్షాలు.. 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

తెలంగాణలో అకాల వర్షాలు..  20 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
  •     వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
  •     ఇందులో 4,500 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం
  •     నేలకొరిగిన వరి, మక్క.. నేలరాలిన మామిడిపూత, కాయలు
  •     నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నష్టం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కొన్ని రోజులుగా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి, మక్క చేన్లు నేలకొరిగాయి. మామిడిపూత, కాయలు రాలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరబోసిన మక్కలు వర్షాలకు తడిసిముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, చేతికొచ్చే టైమ్ లో నేలపాలవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా వరి, మక్క చేన్లు, మామిడి తోటలు దెబ్బతినగా.. కూరగాయల పంటలకు కూడా నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు 4,500 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. టమాటా, బీరకాయ, పచ్చి మిర్చి, క్యాబేజీ, ఉల్లి, క్యాప్సికం తదితర పంటలపై వానల ప్రభావం పడిందని పేర్కొన్నారు. అలాగే మిరప చేన్లు, బొబ్బర్లు, మినుములు, పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. 

త్వరలో పూర్తి నివేదిక.. 

రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి, మెదక్‌‌‌‌ జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అందులోనూ నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోనే వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చారు. యాసంగి సీజన్ లో ఎక్కువగా సాగైన ప్రధాన పంటల్లో వరి, మక్క ఉండగా.. అవే ఎక్కువగా దెబ్బతిన్నాయి. పంట నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. సర్కార్ ఆదేశాలతో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. మరో రెండు మూడ్రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ఆ తర్వాత పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తామని అధికారులు తెలిపారు. 

మరో రెండ్రోజులు వానలు.. 

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు కురిసే చాన్స్ ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కాగా, బుధవారం ఆసిఫాబాద్‌‌‌‌, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి.