డబుల్​ ఇండ్లు @ బర్ల దొడ్లు!

డబుల్​ ఇండ్లు @  బర్ల దొడ్లు!
  • నిర్మాణం కంప్లీటైనా లబ్ధిదారులకు ఇండ్లు ఇస్తలేరు
  • ఇండ్లలో బర్రెలను కట్టేస్తున్న స్థానికులు..
  • మూత్రం, పేడతో  ఇండ్లు ఆగమాగం..
  • మరి కొన్ని ఇండ్లలో అసాంఘిక కార్యక్రమాలు

మెదక్ (శివ్వంపేట), వెలుగు:  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయినా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో బర్ల దొడ్లు, మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఏండ్ల తరబడి నిరుపయోగంగా ఉండడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇండ్లు  పాడైపోతున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో 2016లో 35 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. అందులో 17 ఇండ్లు 2019 లో పూర్తి అయినప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో రెండేళ్లుగా వృథాగానే ఉన్నాయి.  ఖాళీగా ఉన్న కొన్ని  ‘డబుల్’ ఇండ్లలో  గ్రామస్తులు కొందరు తమ  బర్రెలను కట్టేస్తున్నారు. పశువుల మూత్రం, పేడ వేస్తుండడంతో ఇండ్లు అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా మారుతున్నాయి. మరికొన్ని ఇండ్లలో  మందు బాబులు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. సాయంత్రమైతే చాలు దర్జాగా డబుల్​ఇండ్లలో కూర్చొని  మందుకొట్టడంతో పాటు రాత్రి వేళ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. సొంత ఇండ్లు లేని పేదల కోసమని లక్షల  ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 17 ఇండ్లు రెడీగా ఉన్నా..  ఎవరికీ కేటాయించకపోవడంతో వినియోగించకపోవడంతో దెబ్బతింటున్నాయి. 
 ఇండ్ల చుట్టూ చెట్ల పొదలు
నిర్వహణ లేక ఇండ్ల చుట్టూ కంపచెట్ల పొదలు పెరిగి అధ్వానంగా మారాయి. బర్రెలు అక్కడే గడ్డి మేస్తూ ఇండ్లలోనే పడుకుంటున్నాయి.  మరో 18 ఇండ్లు మంజూరు అయినప్పటికీ  కాంట్రాక్టర్లు  ముందుకు రాక నిర్మాణ పనులు షురూ కాలేదు. కంప్లీట్​అయిన ఇండ్ల నిరుపయోగంపై పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్ ను వివరణ కోరగా  టెండర్, అగ్రిమెంట్ అయిన17 ఇండ్ల నిర్మాణం కంప్లీట్​చేశామన్నారు. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు  ముందుకు రాక మిగతా 18 ఇండ్ల నిర్మాణ పనులు షురూ కాలేదని  చెప్పారు. త్వరలోనే మళ్లోసారి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.