50 శాతం టికెట్లు ఇవ్వని పార్టీలను చిత్తుగా ఓడిస్తం :  ఎంపీ ఆర్. కృష్ణయ్య

50 శాతం టికెట్లు ఇవ్వని పార్టీలను చిత్తుగా ఓడిస్తం :  ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు : బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వని పార్టీలను  చిత్తుచిత్తుగా ఓడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీని సీఎంగా ప్రకటించే పార్టీని గెలిపించడానికి ముందుంటామని వెల్లడించారు. బీసీల కులగణన, రాజకీయ దామాషా రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులపై అన్ని పార్టీలను సంసిద్ధం చేయడానికి ఈ నెల 15న బీసీ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామన్నారు. అందులో తీర్మానాలు ఉంటాయని చెప్పారు. బుధవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్​లో బీసీ రాష్ట్ర మహాసభల పోస్టర్​ను ఆవిష్కరించి, మాట్లాడారు.

రాష్ట్ర చరిత్రలో 15 మంది సీఎంలు మారారని..అందులో ఒక్కసారి కూడా 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు సీఎం పదవి దక్కలేదని తెలిపారు. అందుకు రాజకీయ పార్టీలు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి రావడంలో అడుగడుగున నిలబడే బీసీలకు సీట్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. 25 సీట్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అహంకార ప్రకటన పట్ల మండిపడుతూ తగిన గుణపాఠం తప్పదని రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నాగుల శ్రీనివాస్ యాదవ్, బర్కా కృష్ణ యాదవ్, వేముల రామకృష్ణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.