
ఉత్తర్‌ప్రదేశ్: బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు కొందరు వ్యక్తులు. యూపీలోని బహ్రైచ్ జిల్లా ఖైరి డుకోలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి సుహెయిల్ అనే యువకుడు తన బాబాయి ఇంటి ఆవరణలో మూత్రవిసర్జన చేశాడు. ఇది గమనించిన రామ్ మూరత్, సనేహీ, మంజీత్ అనే పొరుగు ఇళ్ల వారు తమ ఇండ్ల ముందు ఎందుకు మూత్ర విసర్జన చేశావంటూ నిలదీశారు. దాంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ లో రామ్‌మూరత్‌తోపాటు ఆత్మారామ్, రాంపాల్, సనేహి, మంజీత్ అనే యువకులు కలిసి సుహెయిల్‌ను తీవ్రంగా కొట్టారు. కర్రలతో కొట్టడంతో అతను ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా సుహెయిల్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి బాబాయి చింతారాం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనకు కారణమైన రామ్ మూరత్, సనేహీ, మంజీత్ లను అరెస్ట్ చేశారు.