
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక యువకుడు తన గేదెతో కలిసి కొత్వాలి (పోలీస్ స్టేషన్)కి వచ్చిన వింత ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. తన గేదెను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ గేదె.. ఈ మధ్య కాలంలో గ్రామంలోని ఒక రైతు పొలంలో ఉన్న మొక్కజొన్నను తిన్నది. దీంతో ఆ రైతు.. గేదెను ముళ్ల తీగతో కట్టి తీవ్రంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న గేదె యజమాని ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం బాధిత రైతు తన గేదెతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. తన గేదె ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వినయ్ అనే యువకుడి పొలంలోని మొక్కజొన్నను తినేసిందని చెప్పాడు.
ఇది చూసిన వినయ్ కోపంతో గేదెను ముళ్ల తీగతో కట్టి కర్రలతో దారుణంగా కొట్టాడు. దీంతో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకుని తన గేదెను విడిపించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు ఆరోపించినట్లు సమాచారం. దీంతో రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ముందు విలపించడం ప్రారంభించాడు. తన గేదె శరీరంపై ఉన్న గాయాలను కూడా సాక్ష్యంగా చూపించాడు. “నా గేదెకు ఏదైనా జరిగి ఉంటే నేను ఏమి చేస్తాను. ఇదే నన్ను బతికించేది’’ అంటూ ఆ రైతు బోరున విలపించడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది.