కూతురుని చంపి తల వేరు చేసిన తండ్రి

కూతురుని చంపి తల వేరు చేసిన తండ్రి

ఉత్తరప్రదేశ్లోని హార్డోయి జిల్లాలో దారుణం జరిగింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తండ్రి.. కూతురి తల నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండేతర గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సర్వేష్ కూతురు స్థానికంగా నివసించే ఒక యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో సర్వేష్ రెండు రోజుల క్రితం తన కూతురును ఆమె ప్రేమికుడితో ఊహించని స్థితిలో చూశాడు. కూతురు తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు మీద సర్వేష్ పదునైన కత్తితో దాడి చేసి.. తలను మొండెంతో వేరుచేశాడు.

ఆ తర్వాత సర్వేష్ తన కుమార్తె తలతో మాజిలా పోలీస్ స్టేషన్ వైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా స్థానికులు గమనించారు. భయాందోళనకు గురైన జనాలు.. పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సర్వేష్‌ను వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు సర్వేష్ ఒప్పుకున్నాడు. ఇంట్లోని గదిలో కూతురి శవం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దాంతో నిందితుడు సర్వేష్ మీద కేసు నమోదు చేసినట్లు హార్దోయి పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ వాట్స్ తెలిపారు.