సొంత చెల్లిని పెళ్లాడిన అన్న

సొంత చెల్లిని పెళ్లాడిన అన్న

ఎవరూ ఊహించని ఘటన జరిగింది. సొంత చెల్లెని ఓ అన్న పెళ్లి చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని ఫిరోజాబాద్ తుండ్లలో డిసెంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 11న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 జంటలు ఒక్కటయ్యాయి,  అయితే ఈ సామూహిక పెళ్లిళ్లో ఓ వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బు తీసుకొని ఆపై పారిపోయాడు. 

వివరాల్లోకి వెళితే.. యూపీలోని సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని కానుకల్ని కూడా అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు. పదివేల విలువచేసే ఇతర గిఫ్ట్స్ కూడా అందిస్తున్నారు. ఇక వీటి కోసం ఆశపడిన ఒక వ్యక్తి సొంత చెల్లిని పెళ్లికూతురిగా మార్చి వివాహానికి హాజరయ్యాడు. అందరిలానే చెల్లి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ఇతర సౌకర్యాలను అందుకుని పారిపోయాడు.

అయితే ఇటీవల వారి ఆధార్ కార్డులను పరిశీలించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ అధికారి చంద్రభాన్ సింగ్ వారిద్దరూ అన్నాచెల్లెలుగా గుర్తించడంతో విషయం బయటపడింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.