
లక్నో : యూపీలో మహిళలపై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలోని మనూ జిల్లాలో ఓ బాలిక(15)ను లైంగికంగా వేధించారు కొందరు దుండగులు. ఆమె ప్రతిఘటించడంతో.. కోపంతో మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. అక్టోబర్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను.. ముగ్గురు యువకులు అడ్డగించి, బలవంతంగా ఓ భవనంలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించారు. యువతి ప్రతిఘటించడంతో.. కోపంతో యువకులు ఆమెను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని అజాంఘర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను లైంగిక వేధింపులకు గురి చేశారని, ప్రతిఘటించనందుకు కోపంతో కొట్టి, కిందకు తోసేశారని బాధితురాలు పేర్కొన్నారు. ఆ ముగ్గురు యువకుల ఇళ్లు తమ ఇంటి పక్కనే అని తెలిపారు.