
ముంబై: టార్గెట్ ఛేజింగ్‌లో అలీసా హీలీ (47 బాల్స్‌లో 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 నాటౌట్), దేవికా వైద్య (31 బాల్స్‌లో 5 ఫోర్లతో 36 నాటౌట్) దంచికొట్టడంతో.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ రెండో విక్టరీని సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెక్ పెట్టింది. ఆర్‌సీబీకి వరుసగా ఇది నాలుగో ఓటమి. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు19.3 ఓవర్లలో 138 రన్స్‌కే ఆలౌటైంది. ఎలీసా పెర్రీ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), సోఫియా డివైన్ (24 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. యూపీ బౌలర్లు ఎకెల్‌స్టోన్ (4/13), దీప్తి శర్మ (3/26) ముప్పేట చేసిన బౌలింగ్ దాడిలో.. కెప్టెన్ స్మృతి మంధానా (4), కనికా అహుజా (8), హీథర్ నైట్ (2), శ్రేయాంక్ పాటిల్ (15), ఎరిన్ బర్న్స్ (12), రిచా ఘోష్ (1), కోమల్ (5 నాటౌట్), రేణుకా సింగ్ (3), సహనా పన్వర్ (0) ఘోరంగా విఫలమయ్యారు. పెర్రీ, డివైన్ రెండో వికెట్‌కు 44 రన్స్ జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తర్వాత యూపీ 13 ఓవర్లలో 139 రన్స్ చేసి గెలిచింది. ఆర్‌సీబీ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.