తెలంగాణలో అప్రజాస్వామ్యం ఓడింది

తెలంగాణలో అప్రజాస్వామ్యం ఓడింది

‘ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను గత మూడు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించడానికి అప్పటి ముఖ్యమంత్రిని దాదాపు 30 సార్లు కలవడానికి ప్రయత్నించాను. అపాయింట్​మెంట్​కోరాను, ప్రగతి భవన్​కు వెళ్లి నిరీక్షించాను, చివరికి మండలి చైర్మన్ ద్వారా నివేదించాను. 

అయినా నా ప్రయత్నాలన్నీ ని‌ష్ఫలమయ్యాయి. ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం నాకు దొరకలేదు’... అంటూ ప్రభుత్వాధినేతను కలవడానికి తాను చేసిన ప్రయత్నాలను, అనుభవాలను, ఆవేదనను వ్యక్తం చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి.

శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు.  సమాజంలో మేధావివర్గంగా పేరొందిన ఉపాధ్యాయులచే ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే... ఇక సామాన్య ప్రజల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో పీఠమెక్కిన నాయకులు ఆ ప్రజలకే అందుబాటులో లేకపోవడం అనేది దారుణమైన విషయం. 

ఇదిలా ఉంటే మరోవైపు.. ‘కొత్తగా ఎన్నికైన ప్రస్తుత ముఖ్యమంత్రిని పదిరోజుల కాలంలో తాను నాలుగు సార్లు కలవగలిగాను. మాట్లాడగలిగాను. సమస్యలపై చర్చించే అవకాశం లభించింది’.. అంటూ ఆ ఎమ్మెల్సీ శాసనమండలి సాక్షిగా తన అనుభవాలను పంచుకున్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది.  ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ తన మనసులోని మాటను వ్యక్తీకరించడం కొసమెరుపు.

అంతా తనకోసమే జరుపుకున్న గత పాలన

‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతాననీ, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తాననీ, సభా నియమాలకు కట్టుబడి ఉంటాననీ, వాటిని అనుసరిస్తాననీ, సభా మర్యాదలను పాటిస్తాననీ, సంప్రదాయాలను గౌరవిస్తాననీ’  అంటూ నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎన్నికైన ప్రతి సందర్భంలోనూ ప్రమాణ స్వీకారం చేయడం అనేది సర్వసాధారణమే. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కొరవడిన ప్రజాస్వామ్యాన్ని పున:ప్రతిష్టిస్తామనే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చి, ప్రజల మద్దతు పొందిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.  ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానాన్నే ప్రజాస్వామ్యం అంటారని’ అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ నిర్వచించారు.  

ప్రజలకు దూరమైన పాలన 

2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి అధికారం కట్టబెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో స్థానికులకు న్యాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ రంగు అనతికాలంలోనే బయటపడింది. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకపోగా ప్రభుత్వంలో, పాలనా యంత్రాంగంలో , పరిశ్రమల్లో ‌ప్రాంతేతరులకు ప్రాధాన్యమిస్తూ, నియంతృత్వ పోకడలతో తెలంగాణ ప్రజలకు క్రమంగా దూరం జరుగుతూ వచ్చింది. 

2018లో రెండవసారి అధికారంలోకి వచ్చాక ఈ దూరం మరింత పెరిగింది. అయితే ... ఇక్కడి ప్రజలు కూడు, గూడు, గుడ్డ లేకపోయినా భరిస్తారు, సహిస్తారు.. కానీ  తమ స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోరు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం ఆయుధాలు చేతబూని, గడీల పాలనను ఎదిరించి, దొరల ఆధిపత్యాన్ని, ఆగడాలను అంతమొందించిన చరిత్రకు వారసులు వీరు. గత ప్రభుత్వ హయాంలో నియంతృత్వ ధోరణులు విపరీతంగా పెరిగిపోయాయనీ, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారనే వాదన ప్రజల్లో సైతం బలపడింది.  

అస్తవ్యస్త  పాలన

కొంతమంది ప్రయోజనాల కోసం ప్రజల సంపదను ధారపోసిన ఘటనలు కోకొల్లలుగా కళ్ళముందే కదలాడుతుండడాన్ని వారు తట్టుకోలేకపోయారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. వాస్తవాలను బయటపెట్టే మీడియాపై ఆంక్షలు విధించడం, ఆర్థికంగా నష్టాలకు గురిచేయడం సర్వసాధారణం అయ్యింది. తమ ప్రభుత్వానికి వంతపాడే ఉద్యమకారులు, కళాకారులకు మాత్రం పదవులిచ్చి, ప్రభుత్వ తీరును ప్రశ్నించే మేధావి వర్గాన్ని దూరం పెట్టడం హేయమైన చర్యగా భావించారు.  

ప్రతి నెల ద్వితీయార్థం వరకు కూడా వేతనాలు చెల్లించకపోవడం, సప్లిమెంటరీ బిల్లులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినా పట్టించుకోకపోవడం, ఉద్యోగుల  ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పి, మాటలకే పరిమితమైన గప్పాలు పలికి,  హీనంగా పరిగణించే తత్వాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేక పోయారు. తమ చిరకాల వాంఛ అయిన ‘ప్రభుత్వ ఉద్యోగం’ పొందాలని వేయి కన్నులతో ఎదురుచూసే నిరుద్యోగులను పట్టించుకోకపోవడం, వేసిన నోటిఫికేషన్లు కూడా సజావుగా నిర్వహించకపోవడం, పేపరు లీకేజీలపై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులపై వ్యంగ్యంగా మాట్లాడడం వంటివి విద్యార్థులు, నిరుద్యోగుల ఎనలేని కోపానికి కారణం అయ్యాయి. 

ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించడం, చట్టసభల్లో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యవాదులకు గుబులు పుట్టించాయి. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే .. గత సీఎం ప్రజలకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అందుబాటులో ఉండరనే విషయం నాణేనికి ఉన్న మరో పార్శ్వం. తాను కలవాలని కోరుకుంటే తప్ప గత ముఖ్యమంత్రి ఎవరికీ అపాయింట్​మెంట్​ ఇవ్వలేదనే విషయం అప్రజాస్వామికమైనదిగా భావించవచ్చు. 

ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్న కొత్త సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన నెలకొల్పడం అసాధ్యమా? గత ప్రభుత్వ పాలనా కాలంలో చేసిన తప్పిదాలను, అప్రజాస్వామిక విధానాలను పునరావృతం కాకుండా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన అసాధ్యమేమీ కాదు. ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే ప్రజాదర్బార్ పేరుతో సామాన్య ప్రజలు సైతం తమ కష్టాలను, తమ బాధలను ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం, తమ గోడును వెళ్లబోసుకునే ఆస్కారం కల్పించడం ప్రజాస్వామ్య పాలన నెలకొల్పడంలో తొలి అడుగుగా భావించవచ్చు. 

ముఖ్యమంత్రి మాత్రమే ఏకచ్ఛత్రాధిపత్యంగా,  గుత్తాధిపత్యంగా వ్యవహరించకుండా మంత్రులు సైతం ఆయా శాఖల్లో, వారి వారి స్థాయిల్లో అవసరమైన మేరకు స్వయం నిర్ణయాలు  తీసుకునేలా అధికారం కలిగి ఉండడం, అలాంటి వాతావరణం నెలకొనడం మలి అడుగుగా పేర్కొనవచ్చు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా కీర్తిని గడించాలి.  ‘ప్రజా తెలంగాణ’ వైపు అడుగులు వేయాలి.

- వరగంటి అశోక్, ఆదిలాబాద్