
జెరూసలేం: దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, సైన్యాధికారుల మధ్య అత్యవసర టెలిఫోన్ చర్చలు జరిగాయి. హమాస్ మొదటగా కాల్పులు జరిపిన తర్వాతే ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా తెలిపింది.
మరోవైపు, రఫాలో ఐఈడీ పేలడంతో ఇజ్రాయెల్ సైనికులకు గాయాలయ్యాయి. రఫాలోని ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనంతరం రెండు వైమానిక దాడులు జరిగాయి. హమాస్ టెర్రరిస్టులు స్నైఫర్ ఫైర్, రాకెట్ ప్రొపేల్డ్ గ్రెనేడ్ తో ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేశారు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి సాయుధ మిలీషియాలు పని చేయడమే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది.