- తాత్కాలికంగా వాయిదా వేసిన కేంద్రం
- వ్యాపారులు వ్యతిరేకించడంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులపై విధించాలనుకున్న అదనపు చార్జీల (మర్చంట్ డిస్కౌంట్ రేట్–ఎండీఆర్) అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాత్కాలికంగా వాయిదా వేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 నుంచి ఈ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉండగా, వ్యాపారుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయాన్ని దీపావళి ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఎండీఆర్ అంటే?
సాధారణంగా మనం దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఆన్లైన్లో యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినప్పుడు, ఆ చెల్లింపు ప్రక్రియను సజావుగా నడిపించేందుకు బ్యాంకులు, పేమెంట్ గేట్వే సంస్థలకు కొంత ఖర్చవుతుంది. ఈ డిజిటల్ నెట్వర్క్ను నిర్వహించినందుకు వ్యాపారి నుంచి వసూలు చేసే సేవా రుసుమునే 'ఎండీఆర్' అంటారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి.
అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం వ్యాపారులకు జరిపే లావాదేవీ విలువ రూ.2 వేలు దాటితే, ఇందులో 0.40 శాతాన్ని చార్జీగా చెల్లించాలి. ఉదాహరణకు, ఒక కస్టమర్ రూ.3,000 విలువైన సరుకులు కొని యూపీఐ ద్వారా చెల్లిస్తే, వ్యాపారి సుమారు రూ.12 వరకు బ్యాంకులకు చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్, స్ట్రాటజిక్ సెక్టార్లలో జరిగే లావాదేవీలకు వేర్వేరు రేట్లు నిర్దేశించారు.
వ్యాపారుల ఆందోళన
ఈ నిబంధన అమల్లోకి వస్తే వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నందున వ్యాపారాలు జోరుగా సాగుతాయని, ఇలాంటి సమయంలో లావాదేవీలపై చార్జీలు విధిస్తే చిన్న, మధ్యతరహా వ్యాపారులు (ఎంఎస్ఎంఈలు) తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తక్కువ లాభాల మార్జిన్తో పనిచేసే వ్యాపారులకు ఈ అదనపు ఖర్చులు పెనుభారంగా మారడమే కాకుండా, ప్రజలు మళ్లీ నగదు లావాదేవీల వైపు మొగ్గుచూపే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు సైతం తమకు సిలిండర్లపై ఫిక్స్డ్ కమీషన్ మాత్రమే ఉంటుందని, ఎండీఆర్ విధిస్తే తాము నష్టపోతామని కేంద్ర పెట్రోలియం శాఖను ఆశ్రయించారు. రూ.2 వేల పరిమితిని తప్పించుకోవడానికి కస్టమర్లు విడతలవారీగా చెల్లించే అవకాశం ఉందని, అది గందరగోళానికి దారితీస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ఈ అంశాన్ని పరిశీలించి, పండుగల సీజన్ ముగిసే వరకు దీనిని నిలిపివేయాలని నిర్ణయించింది.
