హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గవర్నర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలకు అవకాశం ఇవ్వడం అభినందనీయమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, బీసీని ఉపరాష్ట్రపతిగా నియమించారని, గవర్నర్ల నియామకాల్లోనూ అదే స్ఫూర్తితో వ్యవహరించడం హర్షణీయమన్నారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది ఓబీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలంటే బీసీ కులగణనే ఏకైక పరిష్కార మార్గమన్నారు. జనగణనలో ప్రత్యేకంగా ఓబీసీ కాలం చేర్చి, బీసీ కులాల లెక్కలు తీయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
