బిహార్‌‌‌‌ లోని గంగా నదిలో ..బోటు బోల్తా.. మహిళలు, పిల్లలతో సహా14 మంది మృతి

బిహార్‌‌‌‌ లోని గంగా నదిలో ..బోటు బోల్తా.. మహిళలు, పిల్లలతో సహా14 మంది మృతి

పాట్నా: బిహార్‌‌‌‌లోని హాజీపూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ శ్యామ్‌‌‌‌చంద్ గ్రామ సమీపంలోని గంగా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది స్థానికులు ఒక ప్రత్యేక విందుకు (ఫెస్ట్) హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం బోటులో బయలుదేరారు.

మార్గమధ్యలో రాంపూర్ శ్యామ్‌‌‌‌చంద్ గ్రామం వద్ద గంగానదిలో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి తిరగబడింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యల్లో ఐదుగురు ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగారు.

అయితే, ప్రమాదంలో నీటిలో మునిగిపోయి మహిళలు, చిన్నారులు సహా మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. తొలుత ప్రాణనష్టం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ.. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన తర్వాత మృతుల సంఖ్య 14  మందిగా తేలింది. గల్లంతైన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.