వెలుగు స్పెషల్: తెలంగాణలో రాజకీయ శూన్యత

వెలుగు స్పెషల్: తెలంగాణలో రాజకీయ శూన్యత

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఓడిపోయింది. అధికారంలో లేని అన్నాడీఎంకే అధికారంలోకి రాలేదు. ఆశ్చర్యంగా టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం ఏమిటి?.  ఎం.కె. స్టాలిన్ ముఖ్యమంత్రి కావడానికి చాలాకాలం  వేచి ఉండాల్సి వచ్చింది.  స్టాలిన్‌‌‌‌ అధికారాన్ని చేజిక్కించుకోలేదు. అనువంశికంగా పొందాడు.  కొన్ని దశాబ్దాలు పార్టీలో పనిచేసి, తిరుగుబాటు చేయకుండా, తండ్రి, పూర్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని సవాలు చేయకుండా ముఖ్యమంత్రి అయ్యాడు.  క్రమశిక్షణతో, చాలా ఓర్పుతో ఆ స్థాయికి ఆయన ఎదిగాడు. 2011 నుంచి గెలుస్తూ వచ్చిన కొలత్తూర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌ నియోజకవర్గంలో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ప్రజావ్యతిరేకత అనేది రొటీన్‌‌‌‌ పదం అంతకుమించి ఇంకా ఏమైనా  అనవచ్చు.  డీఎంకే,  ఆ పార్టీతో జతకట్టిన పార్టీలు ఈ ఎన్నికలకన్నా ముందు జరిగిన పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ఒక ఊపుతో గెలిచినా.. డీఎంకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. 

తమిళ సినిమా నటుడు విజయ్‌‌‌‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగమ్‌‌‌‌ (టీవీకే) 234 సీట్లలో 107 సీట్లు గెలుచుకుంది.  డీఎంకే 60 సీట్లకు, అన్నాడీఎంకే 47 సీట్లకు పరిమితమయ్యాయి.  గత ఐదు సంవత్సరాలలో  ప్రజలకి సుపరిపాలనను అందించామని ఎం.కె. స్టాలిన్‌‌‌‌ భావించారు. కానీ,  ఆయన ఓటమిపాలయ్యారు. అనువంశిక అథారిటీ కిందపడిన గాజు సీసా మాదిరిగా పగిలి ముక్కలైపోయింది.  గతంలో  మాదిరిగా ఒక పార్టీ ఓడిపోతే మరో పార్టీ అధికారంలోకి  వస్తుందన్న  భ్రమలన్నీ  పటాపంచలైపోయాయి. 

తెలంగాణలో రాజకీయ ఖాళీ

తమిళనాడు  రాజకీయాలను  ఎందుకు  ప్రస్తావించాల్సి వస్తుందంటే.. అలాంటి  పరిస్థితి  తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా అన్న విషయాన్ని అంచనా వేయడానికి.  మన రాష్ట్రంలో ఉన్నవి మూడు ప్రధాన పార్టీలు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ. గత ఎలక్షన్లలో బీజేపీకి ఓ ఊపు ఉంది. కానీ, వాళ్లు దాన్ని సరిగ్గా  వినియోగించుకోలేకపోయారు.  పార్టీ అధ్యక్షుడి మార్పుతో ఆ పార్టీ డీలా పడిపోయింది.  ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో అంత మెరుగ్గా లేదు.  ఇక మిగిలినవి  రెండు పార్టీలు.  అవి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ,  రెండోది అధికారం కోల్పోయిన  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ.  ఈ  రెండు పార్టీలలో ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.  

ప్రజలకు వేరే గత్యంతరం లేదు. ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ఈ రెండు పార్టీలలో ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి.  అవినీతి విషయానికి వస్తే  మనం ప్రత్యేకంగా  ప్రస్తావించాల్సిన అవసరం సాంఘిక మాధ్యమాలలో రెండు పార్టీలు ఒకరి గురించి మరొకరు చేసుకుంటున్న ఆరోపణలని  ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.  రెండు పార్టీలు రెండు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయమైన ఖాళీ ఉంది.  దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే నాయకుడు కనిపించడం లేదు.  

కీలక పదవుల్లో ఆంధ్రులు

తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలో ఉన్నప్పటికీ చాలామంది ఆంధ్రులు చాలా నియామకాల్లో  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది  సమాచార హక్కు కమిషన్‌‌‌‌ కావొచ్చు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌ కావొచ్చు.  పీసీబీ  అప్పిలేట్‌‌‌‌ అథారిటీ చైర్మన్‌‌‌‌  కావొచ్చు.  రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌‌‌‌ కావొచ్చు. తెలంగాణ ఈఆర్‌‌‌‌‌‌‌‌ఎసీ కావొచ్చు. ‘రెరా’ చైర్మన్‌‌‌‌ కావొచ్చు. ఇవి కాకుండా ఎన్ని సంస్థలు ఉన్నాయో తెలియదు. వీటన్నింటి నిండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తులను  నియమించారు. ఈ నియామకాలు ప్రమోషన్‌‌‌‌ మీద జరిగినవి కాదు. ప్రభుత్వం, లేదా కమిటీలు ఎంపిక చేసినవి. ఇక మిగతా సంస్థల్లో ఒక ప్రధానమైన అధికార వర్గం ఆధిపత్యంలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం సరిదిద్దవచ్చు. కానీ, ఆ చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదు.  

పేరుకే  తెలంగాణ హైకోర్టు

ఇక హైకోర్టు  సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అది పేరుకే  తెలంగాణ హైకోర్టు.  ఎక్కువ మంది న్యాయమూర్తులు ఆంధ్రా మూలాలు ఉన్నవారే.  జిల్లా న్యాయవ్యవస్థలో ఎక్కువ శాతం హైకోర్టు న్యాయమూర్తులు కావడానికి అవకాశం ఉన్న వ్యక్తులు  ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే.  కొంతమంది  న్యాయమూర్తుల బదిలీల వల్ల వారి సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తుందేమో.   ప్రభుత్వ న్యాయవాదుల్లో  కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు ఉన్నారు.  కొంతమంది యువ న్యాయవాదులు  అంటున్న మాట ‘పేరుకే తెలంగాణ, ఆధిపత్యం ఇంకా ఆంధ్రా ప్రాంతానిదే’. ఇది  న్యాయవాదులే కాదు. నేటి యువత అంటున్న మాట. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌‌‌‌ యువత ఓటు వేస్తారనేది సందేహాస్పదమే.

తెలంగాణలో కొత్త పార్టీకి చోటు 

 కాళేశ్వరం ఏం జరిగిందో నిష్ణాతులు చెప్పాలి. కానీ,  ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌,  ప్రభుత్వం అవసరమైన స్పష్టతను ఇవ్వడం లేదు. చర్చల్లో నుంచి మధ్యలోనే వెళ్లిపోయే నాయకులు కనిపిస్తున్నారు. అధినాయకుడు ప్రజలకు దూరంగా ఉండటం కూడా ఆ పార్టీకి ప్రధానమైన లోపంగా భావించవచ్చు.  ఈ రెండు పార్టీల పరిస్థితి  ఇలా ఉన్నప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.  

రెండు పార్టీలు ఒకరి అవినీతి గురించి మరొకరు, విమర్శించుకోవడంతోనే  కాలాన్ని గడుపుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పునాది మీద అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఇన్ని నియామకాల్లో ఆంధ్రావాళ్లు ఆధిపత్యం కొనసాగుతుంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని  వెళ్లడంలో విఫలమైందనే చెప్పవచ్చు.  ఈ పరిస్థితులు ఉన్న తెలంగాణలో ఓ కొత్త పార్టీకి చోటు ఉందనేది అందరూ అంటున్న మాట.  తమిళనాడులో జరిగిందే తెలంగాణలో  కూడా జరుగుతుంది. దానికి కావాల్సింది.  అలాంటి విశ్వాసాన్ని  కలిగించే  నాయకుడు. ఈ రెండు పార్టీలు తమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం యువతలో ఉంది. అలాంటి ఆకాంక్షలు ఉన్న యువతని ఆకర్షించే నాయకత్వం తెలంగాణకి అవసరం ఉంది. దానికి సినిమా నటుడే అవసరం లేదు.  

కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై ప్రజావ్యతిరేకత

పాలనాశైలిలో  ప్రభుత్వ నిర్వహణలో  మార్పు వస్తుందన్న భావనను కలగజేయాలి.  ద్రవిడ రాజకీయాలకి అతీతంగా తమిళనాడు  ప్రజలు ఓటు వేశారు.  వాళ్లు తమ అస్తిత్వాన్ని దూరంపెట్టి విజయ్‌‌‌‌ పార్టీకి ఓటువేసి అధికారం కట్టబెట్టారు. టీవీకే పార్టీ గెలవడానికి ప్రధాన కారణం తాము ప్రత్యామ్నాయంగా ఉన్నామనే విశ్వాసాన్ని విజయ్‌‌‌‌ తమిళ  ప్రజలకు కలిగించాడు. ఆయన పాపులర్‌‌‌‌‌‌‌‌ సినీ నటుడు కావడం కొంత తోడ్పడి ఉండవచ్చు. మార్పు కోరుకుంటున్న  ప్రజలు యువత, విజయ్‌‌‌‌ పార్టీవైపు మొగ్గు చూపారు. 

ప్రభుత్వ వ్యతిరేకత కూడా కారణం కావొచ్చు. తెలంగాణ  రాష్ట్రంలో  గతంలో అధికారంలో ఉన పార్టీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌. ఇప్పుడు  అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.  ఈ రెండు పార్టీల మీద ప్రజావ్యతిరేకత ఉంది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ మీద  ప్రజా వ్యతిరేకత ఇంకా పోయిందని అనిపించడం లేదు. తెలంగాణ  ప్రజలకి ఇప్పడు కావాల్సింది  ప్రత్యామ్నాయ పార్టీ.  ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం. చొరవ తీసుకుని  ప్రజలకు విశ్వాసం కలిగించే నాయకుడు కావాలి. అది  ఎవరైనా ఫర్వాలేదు. 

రాజకీయ శూన్యత కొనసాగుతుందా? 

 ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు,  ప్రజల యోగ క్షేమాలు చూసేవాడు తెలంగాణకి అవసరం ఉంది.  ఎవరైనా లేదా కొంతమంది నాయకులు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం తెలంగాణలో ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో  రాజకీయ శూన్యత ఉంది.  దీన్ని పూరించే వ్యక్తి రానప్పుడు మిగిలేవి రెండు పార్టీలే.  అవి కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లు.  అధికారంలో ఉన్నా,  లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తెలంగాణకి అవసరం ఉంది.  మనం ఎన్ని చెప్పినా చివరికి సమాధానం చెప్పాల్సింది  ప్రజలే.  ప్రజల చేతిలో ఉన్న ఓటు డబ్బులు కొన్నిసార్లు గెలిపిస్తాయి. అన్నిసార్లు గెలిపించవు. ఈ విషయం అందరి రాజకీయ నాయకులకి తెలిసిందే. అయినా డబ్బులే గెలిపిస్తాయని భావిస్తూ ఉంటారు. రాజకీయ శూన్యత కొనసాగుతుందా?  ఏమైనా మార్పులు వస్తాయా? కాలమే సమాధానం  చెప్పాల్సిన ప్రశ్నలు ఇవి.  


‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్, 
జిల్లా జడ్జి (రిటైర్డ్)

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.