హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఏఐటీయూసీ సీనియర్ నేత వి.ఎస్.బోస్, ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు ఎస్.బాబు, కోశాధికారి ప్రసాద్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటుహక్కును హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజల్లో నమ్మకం పోయిందని, విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్య పద్మ మాట్లాడుతూ.. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పత్తికి రూ.50 వేలు, వరికి రూ.30 వేలు, కూరగాయలు ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
