వన్డే వరల్డ్ కప్ కోసం సిద్దమవనున్న ఉప్పల్ స్టేడియం

వన్డే వరల్డ్ కప్ కోసం సిద్దమవనున్న ఉప్పల్ స్టేడియం

వన్డే వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం  సరికొత్తగా ముస్తాబవబోతుంది. ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచులు జరగనుండటంతో...ఈ స్డేడియాన్ని అత్యాధునికంగా తయారు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్డేడియంలో మరమ్మతుల కోసం రూ. 117 కోట్లు కేటాయించింది.  ఈ ఏడాది అక్టోబర్‌ -నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ భారత్‌లో జరగనుంది. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి మరమ్మతులు చేపట్టాని బీసీసీఐ నిర్ణయిచింది. ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో మరమ్మతులు చేయనున్నారు. 

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కనీస సౌకర్యాలు లేవని ప్రేక్షకులు ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా స్టేడియంలో వాష్‌రూమ్‌లు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రేక్షకులకు కూర్చునే కుర్చీలు అత్యంత చెత్తగా ఉంటాయి.  స్టేడియంలోకి ప్రవేశించే సమయంలో ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో కనీస సౌకర్యాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏక సభ్య కమిటీ కూడా అంగీకరించింది. స్టేడియం అధ్వాన్నంగా ఉందని.. దీనికి భారీ మరమ్మతులు అవసరమని జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా స్టేడియంలో  మరుగుదొడ్లు, వాటి  నిర్వహణ అధ్వాన్నంగా ఉందన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని...నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. 

మ్యాచులు చూసేందుకు డబ్బులు చెల్లించి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత HCA పై ఉందని జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిమానులకు ప్రాథమిక సౌకర్యాలు, ముఖ్యంగా వాష్‌రూమ్‌లు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రేక్షకులకు తాగునీరు అందించేందుకు  స్టేడియంలో 40 కూలింగ్ డ్రింకింగ్ వాటర్ టాప్ లను ఏర్పాటు చేయనున్నారు.  దీంతో పాటు కుర్చీలు కూడా విరిగిపోయాయి. వరల్డ్ కప్ నాటికి వీటిని కూడా మార్చనున్నారు. గతంలో బలమైన ఈదురుగాలుల వల్ల సదరన్ స్టాండ్‌లో పై కప్పు ఎగిరిపోయింది. దీనికి కూడా మరమ్మతులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లడ్‌లైట్‌లు LED లైట్‌లుగా మార్చనున్నారు. అలాగే కొత్త స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు.స్టేడియంలోకి సాఫీగా ప్రవేశించేందుకు టర్న్‌స్టైల్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు...కూలింగ్ ప్లాంట్ లను అమర్చబోతున్నారు.  పాత లిఫ్ట్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు.