తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఆగకుండా వానలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని IMD మరోసారి అలర్ట్ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం ఎగువ మానేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నర్మాల జలాశయం పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. డ్యామ్ దిగువ భాగంలో ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగించవద్దన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలని, విద్యుత్ స్తంభాలను చేతులతో తాకరాదని తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, నిండిన చెరువుల వద్దకు వెళ్లవద్దని, భారీ వర్షాల నేపథ్యంలో జల వనరులు నిండినందున పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో ప్రత్యేకంగా 24X7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సహాయం, సమాచారం, ఏవైనా ఫిర్యాదులుంటే కాల్ సెంటర్ నంబర్ (93986 84240)లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలకు సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వరదలు పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి.
