మా నాన్నను వదిలేయండి.. పోలీస్ వాహనానికి తల బాదుకున్న చిన్నారి

మా నాన్నను వదిలేయండి.. పోలీస్ వాహనానికి తల బాదుకున్న చిన్నారి

యూపీలో ఓ చిన్నారి తన తండ్రిని విడిచిపెట్టాలంటూ పోలీసులను వేడుకుంటున్నఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి కోసం ఆ చిన్నారి పోలీసుల వాహనానికి తలను బాదుకోవడం చూస్తే కన్నీళ్లు వస్తాయి. అసలేం జరిగిందంటే.. యూపీలో పటాకులపై ఇప్పటికే నిషేధం ఉంది. బులంద్ షహర్ లోని ఖుర్జా ఏరియాలో కొందరు షాపులు పెట్టి క్రాకర్స్ అమ్ముతున్నారు. అక్కడే ఓ చిరు వ్యాపారి రోడ్ సైడ్ లో చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఇంకా అక్కడ చాలా మంది షాపులు పెట్టుకున్నారు. ఐతే… పోలీసులు వచ్చి ఆ వ్యక్తి షాపులోని పటాకులను చిందరవందరగా పడేశారు. ఆ వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తన తండ్రిని తీసుకెళ్లొద్దంటూ ఆ వ్యక్తి కూతుళ్లు పోలీసులను అడ్డుకున్నారు. విడిచిపెట్టాలని పోలీసులను  బతిమిలాడారు. పోలీసులు ఆ చిన్నారుల మాటలు పట్టించుకోలేదు. ఆ వ్యక్తిని  జీపు ఎక్కించబోయారు. ఇది చూసి తట్టుకోలేని ఆయన కూతురు..తన తండ్రిని వదిలేయాలని జీపుకు తల బాదుకుంది.  అక్కడ చాలా మంది పోలీసులున్నా.. ఆ చిన్నారిని పక్కకు తీయలేదు.

చిన్నారి ఆవేదనను చూసి అక్కడ  ఉన్నవాళ్లంతా చలించిపోయారు. చిన్నారి బాధను చూసి ఆ వ్యక్తిని విడిచిపెట్టాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. అడ్డమొచ్చిన వారిని కాళ్లతో తంతూ.. వారిని బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీ పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని సడలింపులు ఇచ్చినా పోలీసులు మాత్రం షాపు ఓనర్లపై ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు దారి తీసింది.