యూరియా యాప్కు ఫుల్ రెస్పాన్స్.. 1.15 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసిన 37 వేల మంది రైతులు

యూరియా యాప్కు ఫుల్ రెస్పాన్స్.. 1.15 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసిన 37 వేల మంది రైతులు
  • లక్ష మందికి పైగా ఫెర్టిలైజర్ యాప్ డౌన్​లోడ్

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ శాఖ తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ కు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ యాప్‌‌‌‌ ను ఇప్పటికే లక్ష మందికి పైగా డౌన్‌‌‌‌ లోడ్ చేసుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 37,264 మంది రైతులు 1,15,534 యూరియా బస్తాలను బుకింగ్ ద్వారా కొనుగోలు చేసుకున్నారు. 

రైతులు ఇంటి వద్ద నుంచే సులభంగా యూరియా బుక్ చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్, మహబూబ్‌‌‌‌నగర్, నల్గొండ, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో ఈ యాప్‌‌‌‌ ను ప్రవేశ పెట్టారు. మొదట పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన ఈ యాప్‌‌‌‌ ను తర్వాత మిగతా నాలుగు జిల్లాలకు విస్తరించారు. జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్‌‌‌‌లో 897 మంది, జనగామలో 5,150 మంది, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 3,741 మంది, నల్గొండలో 3,618 మంది, పెద్దపల్లిలో 6,289 మంది రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశారు. రైతులు తమ సమీపంలోని డీలర్ల వద్ద నుంచి బుక్ చేసిన యూరియాను సులభంగా తీసుకునేలా ఈ యాప్ రూపొందించారు. 

ఈ యాప్ ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం రైతుల భయాందోళనలను తగ్గించి, యూరియా పంపిణీని సుగమం చేయడమే. గతంలో రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుని, నిర్దేశిత సమయంలో తీసుకునే అవకాశం కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌ లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌‌‌‌ ను రైతులు, డీలర్లు, పంపిణీదారులు సులభంగా ఉపయోగించవచ్చు. 

దశలవారీగా మిగతా జిల్లాల్లో అమలు..  

రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌‌‌‌ ను ప్రవేశపెట్టిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలకే పరిమితం అయిన ఈ యాప్ సేవలను త్వరలో మిగతా జిల్లాల్లోనూ దశలవారీగా అమలు చేస్తామన్నారు. ఈ డిజిటల్ చొరవతో యూరియా పంపిణీలో పారదర్శకత పెరిగి, రైతులకు మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి మాట్లాడుతూ.. ‘‘యూరియా యాప్ విజయవంతంగా నడుస్తోంది. 

రైతులు ఇంటి వద్ద నుంచే సులభంగా యూరియా బుక్ చేసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. మిగతా జిల్లాల్లోనూ విడతల వారీగా ఈ యాప్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నాం. పైలట్ జిల్లాలు తప్ప మిగతా జిల్లాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సాధారణంగా కొనుగోలు కేంద్రాల వద్దే యూరియా తీసుకోవచ్చు’’ అని తెలిపారు.