- అమెరికా అప్పు 39 లక్షల కోట్ల డాలర్లు.. ఐదు నెలల్లోనే లక్ష కోట్ల డాలర్ల పెరుగుదల
- ఏడాదికి వడ్డీల కోసం ట్రిలియన్ డాలర్లు కేటాయింపు
- ఇండియా జీడీపీ 4.5 ట్రిలియన్ డాలర్లు.. డెట్ టూ జీడీపీ రేషియో 62 శాతం
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వ అప్పులు గత వారం ఏకంగా 39 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్లకు (దాదాపు రూ.3,588 లక్షల కోట్లకు) చేరాయి. కేవలం ఐదు నెలల్లోనే ట్రిలియన్ డాలర్లు (రూ.92 లక్షల కోట్లు) పెరిగాయి. ట్రంప్ రెండో టర్మ్‌లో అమెరికా అప్పు వేగంగా పెరుగుతోంది. 37 ట్రిలియన్ డాలర్ల నుంచి 38 ట్రిలియన్ డాలర్లకు కూడా కొన్ని నెలల్లోనే చేరింది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ డేటా ప్రకారం, గత వారం అమెరికా నేషనల్ డెట్ ఈ నెల 17 నాటికి 39.016 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యధిక స్థాయి. ఈ దేశ జీడీపీ 31 ట్రిలియన్ డాలర్లు (రూ.2,852 లక్షల కోట్లు) కాగా, డెట్ టు జీడీపీ రేషియో 101 శాతానికి చేరింది.
ముఖ్యంగా ట్రెజరీ సెక్యూరిటీల ద్వారా తీసుకున్న రుణాన్ని ఈ అప్పు ప్రతిబింబిస్తోంది. 2017లో అమెరికా అప్పు 19 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడు అది రెట్టింపు అయింది. అప్పు పెరిగిపోతుండడంతో అమెరికా ప్రభుత్వం చెల్లించే వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. యూఎస్ అప్పుపై 2024లో ఏడాదికి 880 బిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ ఏడాది చివరికి ఇది 1 ట్రిలియన్ డాలర్లు (రూ.92 లక్షల కోట్లు) దాటే అవకాశం ఉందని అంచనా. అంటే ప్రతి నెలా 83 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.63 లక్షల కోట్ల)ను వడ్డీ చెల్లింపులకే కేటాయించాల్సి ఉంటుంది. మెడికల్ కేర్, డిఫెన్స్ ఖర్చులకు ధీటుగా ఇది ఉంది.
విదేశీ అప్పుల వాటా 25 శాతం
అమెరికా మొత్తం అప్పులో సుమారు 25శాతం వాటా ఫారిన్ ఇన్వెస్టర్లది. జపాన్ 1.13 ట్రిలియన్ డాలర్లను అమెరికాకు డెట్ మార్కెట్ ద్వారా అప్పు ఇవ్వగా, యూకే 807 బిలియన్ డాలర్లు, చైనా 750 బిలియన్ డాలర్లు, ఇండియా 190 బిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీలను కలిగి ఉన్నాయి. మిగతా 75శాతం అప్పు అమెరికాకు చెందిన సోషల్ సెక్యూరిటీ, ఫెడరల్ రిజర్వ్, ప్రైవేట్ ఇన్వెస్టర్లు, పెన్షన్ ఫండ్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వంటి సంస్థల చేతిలో ఉంది. ఇరాన్‌తో యుద్దానికి దిగడంతో అమెరికా అప్పు త్వరలోనే 40 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.
ఇండియా అప్పు తక్కువే
ఇండియా ఎక్స్‌టర్నల్ (విదేశాల నుంచి తీసుకున్నవి) డెట్ కిందటేడాది సెప్టెంబర్ నాటికి 746 బిలియన్ డాలర్లు (రూ.68 లక్షల కోట్లు)గా నమోదైంది. దేశ జీడీపీ 4.5 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.414 లక్షల కోట్లు) కాగా, డెట్ టు రేషియో 19 శాతం దగ్గర ఉంది. దేశీయంగా తీసుకున్న అప్పులను కూడా కలుపుకుంటే ఇండియా మొత్తం అప్పు దాదాపు రూ.250 లక్షల కోట్లుగా, డెట్ టూ జీడీపీ రేషియో 62–64 శాతంగా ఉంది. ప్రభుత్వం 2026–27లో ఈ రేషియోని 55 శాతానికి తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
