ఇరాన్ సమీపంలో అమెరికా ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌.. 24 గంటల్లో 50కి పైగా యుద్ధ విమానాల మోహరింపు

ఇరాన్ సమీపంలో అమెరికా ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌.. 24 గంటల్లో  50కి పైగా యుద్ధ విమానాల మోహరింపు
  • జెనీవాలో ఇరు దేశాల మధ్య అణు చర్చలు ముగిసిన వెంటనే కీలక పరిణామాలు
  • హార్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
  • మిడిల్‌‌ ఈస్ట్‌‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు


అమెరికా, ఇరాన్‌‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య అణు చర్చలు కొనసాగుతున్నా మిడిల్‌‌ ఈస్ట్‌‌కు అమెరికా సైన్యం 24 గంటల్లోనే 50కిపైగా ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌ను తరలించింది. జెనీవాలో ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


టెహ్రాన్‌‌: అమెరికా, ఇరాన్‌‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య అణు చర్చలు కొనసాగుతున్నా మిడిల్‌‌ ఈస్ట్‌‌కు అమెరికా సైన్యం 24 గంటల్లోనే 50కిపైగా ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌ను తరలించింది. జెనీవాలో ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. జెనీవా చర్చల్లో ‘పురోగతి’ ఉందని ఇరు దేశాల అధికారులు చెబుతున్నప్పటికీ, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వాషింగ్టన్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.  దీంతో అమెరికా ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. 

ఇజ్రాయెల్‌‌తో జరిగిన 12 రోజుల యుద్ధం , ప్రస్తుత ఉద్రిక్తతల ప్రారంభం నుంచి ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనేది అమెరికా ప్రధాన ఉద్దేశం. ఇరాన్ పాలక యంత్రాంగం నిరసనకారులపై చేస్తున్న హింసాత్మక చర్యల వల్ల ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, అమెరికా మాత్రం తన ‘రెడ్ లైన్’ విషయంలో పట్టుదలతో ఉంది. మరోవైపు, ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ‘లైవ్ ఫైర్ డ్రిల్స్’ (సైనిక విన్యాసాల) కోసం హార్మూజ్ జలసంధిని  తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాతో పరోక్షంగా అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

చర్చల్లో మిశ్రమ ఫలితాలు: జేడీ వాన్స్‌‌

అమెరికా–ఇరాన్‌‌ మధ్య చర్చల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని అమెరికా వైస్‌‌ ప్రెసిడెంట్​ జేడీ వాన్స్‌‌ వెల్లడించారు. ‘‘ఒకవైపు చర్చలు  జరుగుతున్నప్పటికీ.. ట్రంప్ నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండటానికి ఇరాన్ ఇష్టపడటం లేదు. చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ.. అధ్యక్షుడు విధించిన ఆంక్షలను అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది” అని మీడియాకు చెప్పారు.  యూఎస్‌‌ ఇంకా దౌత్యపరమైన పరిష్కారాలనే ఇష్టపడుతుందంటూనే.. తమ అధ్యక్షుడి వద్ద మరిన్ని ఎంపికలు ఉన్నాయంటూ హెచ్చరించారు.  

మరోవైపు, జెనీవాలో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని అమెరికా, ఇరాన్‌‌  పేర్కొన్నాయి. చర్చల్లో పురోగతి సాధించామని.. కొన్నింటిపై ఇంకా స్పష్టత రావాలని యూఎస్‌‌ అధికారులు తెలిపారు. ఓ ఒప్పందం కుదుర్చుకునేందుకు మార్గం సుగమమైందని ఇరాన్‌‌ మంత్రి అబ్బాస్‌‌ అరాఘ్చీ వెల్లడించారు.