 
                                    - లక్షలాది మంది ఇండియన్లపై తీవ్ర ప్రభావం
- గురువారం నుంచే అమల్లోకొచ్చిన కొత్త రూల్
వాషింగ్టన్: అమెరికాలో ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఆటోమెటిక్ రెన్యువల్‌ను రద్దు చేస్తూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) బుధవారం మధ్యంతర నిబంధన జారీ చేసింది. ఈ నిబంధన గురువారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉద్యోగ అనుమతిని పొడిగించే ముందు విదేశీయుల సరైన స్క్రీనింగ్, వెట్టింగ్‌ను నిర్ధారించడానికే ఈఏడీ ఆటోమెటిక్ రెన్యువల్‌ను రద్దు చేస్తున్నట్లు డీహెచ్ఎస్ పేర్కొన్నది.
అక్టోబరు 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్) పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని, అయితే ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని డీహెచ్ఎస్ తెలిపింది.
నిర్ధిష్టమైన తేదీకి ముందే దాఖలు చేసిన అప్లికేషన్ల ఈఏడీని మాత్రమే పొడిగించనున్నట్లు చెప్పింది. కాగా, ఈ నిర్ణయం.. అమెరికాలో పని చేసుకుంటున్న లక్షలాది వలస కార్మికుల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఇండియన్లు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా, హెచ్ -4 వీసాదారులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
బైడెన్ సంస్కరణలకు ఫుల్స్టాప్
బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022, మేలో ఈఏడీ ఆటోమెటిక్ రెన్యువల్‌కు చట్టంలో కొన్ని సంస్కరణలు చేసింది. వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. తాజాగా ఈ విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్ సర్కారు కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
వలసదారుడు లేట్‌గా దరఖాస్తు చేసుకున్నా, లేదంటే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రాసెసింగ్ కోసం సమయం ఎక్కువ తీసుకున్నా.. ఈఏడీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పాత ఈఏడీ గడువు ముగిసిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోతారు. ఉద్యోగంలో అంతరాయం రాకుండా ఉండాలంటే, దరఖాస్తుదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్సీఐఎస్ ప్రత్యేకంగా ఓ కార్డు ఇస్తుంది. దాన్నే ఫామ్ I-766/ఈఏడీ కార్డు అంటారు.
అమెరికాలో పనిచేయడం హక్కు కాదు.. ప్రత్యేక సదుపాయమే
యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేయడం హక్కు కాదని.. ఒక ప్రత్యేక సదుపాయం మాత్రమేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ 30కు ముందు ఫైల్ చేసిన అప్లికేషన్లకు మునుపటి రూల్స్ (540 రోజుల పొడిగింపు) వర్తిస్తుందని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు అమెరికన్ల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు.
తాము అమెరికన్ల ఉద్యోగ భద్రత, సేఫ్టీకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇక నుంచి మైగ్రెంట్లు ఉద్యోగ అనుమతి పొందాలంటే డాక్యుమెంటేషన్ స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందేనని చెప్పారు.

 
         
                     
                     
                    