మళ్లీ దద్దరిల్లిన కాబూల్ 

మళ్లీ దద్దరిల్లిన కాబూల్ 
  • ఇండ్లపై టెర్రరిస్టుల రాకెట్ దాడి
  • ఒక చిన్నారి సహా ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
  • సూసైడ్ బాంబర్ల కారును పేల్చేసిన అమెరికా
  • ఎయిర్ పోర్టు వైపు వస్తుండగా డ్రోన్​తో అటాక్
  • మరో భారీ టెర్రర్ కుట్ర భగ్నం  
  • సింగర్‌ ఫవాద్‌ అందరాబిని ఇంట్లోంచి 
  • గుంజుకొచ్చి కాల్చి చంపిన తాలిబాన్లు

కాబూల్:  అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం కాబూల్​లోని ఇండ్లపై టెర్రరిస్టులు రాకెట్ దాడికి పాల్పడగా.. ఎయిర్ పోర్టు వైపు వస్తున్న సూసైడ్ బాంబర్ల కారును అమెరికా పేల్చివేసింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద మళ్లీ టెర్రర్ అటాక్ జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎయిర్ పోర్టుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఖాజే బాఘ్రా పరిధిలోని గులాయి ప్రాంతంలోని ఇండ్లపై మధ్యాహ్నం రాకెట్ దాడి జరిగింది. భారీ పేలుడు శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఓ చిన్నారితో పాటు ఆరుగురు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారని కాబూల్ పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడింది తామేనని  ఏ టెర్రరిస్టూ సంస్థా ప్రకటించలేదు. 
టెర్రరిస్టుల కారు పేల్చివేత  
కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద మరోసారి భారీ ఎత్తున బాంబు దాడికి ఐఎస్ కే టెర్రరిస్టులు చేసిన కుట్రను అమెరికా సైన్యం భగ్నం చేసింది. పలువురు సూసైడ్ బాంబర్లతో కూడిన కారు ఎయిర్ పోర్టు వైపు వస్తుండగా అమెరికన్ ఆర్మీ డ్రోన్ స్ట్రైక్​తో పేల్చివేసింది. కారులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉండటంతో డ్రోన్ దాడి తర్వాత భారీ ఎత్తున పేలుడు సంభవించిందని అమెరికా అధికారులు తెలిపారు. డ్రోన్ దాడి విజయవంతం అయిందని, ముప్పును తొలగించామని ప్రకటించారు. ఈ దాడిలో సాధారణ ప్రజలు ఎవరైనా చనిపోయారా? అన్నది ఇంకా తెలియలేదని చెప్పారు. ఎయిర్ పోర్టు వద్ద గురువారం జంట పేలుళ్లతో 180 మందిని ఐఎస్ కే టెర్రరిస్టులు బలితీసుకున్న తర్వాత అమెరికా చేసిన రెండో డ్రోన్ దాడి ఇది. ఎయిర్ పోర్టువద్ద సూసైడ్ అటాక్​కు ప్లానేసిన టెర్రరిస్టును శనివారం డ్రోన్​తో దాడిచేసి హతమార్చింది. ఆదివారం మళ్లీ డ్రోన్ దాడితో భారీ కుట్రను భగ్నం చేసింది.