ఉస్మానియా యూనివర్సిటీకి అమెరికా ఫౌండేషన్ భారీ విరాళం.. మొదటి విడతలో రూ.40 లక్షల చెక్కు అందజేత

ఉస్మానియా యూనివర్సిటీకి అమెరికా ఫౌండేషన్ భారీ విరాళం.. మొదటి విడతలో రూ.40 లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి అమెరికాకు చెందిన ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (స్వయంప్రతిపత్తి) లోని మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం నూతన భవన నిర్మాణానికి 'టెల్లా సకమోటో ఫౌండేషన్' (The Tella Sakamoto Foundation, USA) 1,00,000 అమెరికన్ డాలర్ల (ఒక లక్ష యూఎస్ డాలర్లు) భారీ విరాళాన్ని ప్రకటించింది. అంటే దాదాపు కోటి రూపాయల విరాళం.

ఒప్పందంలో భాగంగా, మొదటి విడతగా రూ. 40 లక్షల చెక్కును 2026 మే 21న ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలుమ్ని అసోసియేషన్ (AAUCEOU) ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC), హైదరాబాద్‌కు ఈరోజు అధికారికంగా అందజేశారు. ఈ నిధులను మైనింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు (ల్యాబ్స్), పరిశోధనా కేంద్రాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించనున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి బ్యాచ్‌కి చెందిన ప్రముఖ పూర్వ విద్యార్థి  టి. గోపాల్ రావు చొరవ, సహకారంతోనే టెల్లా సకమోటో ఫౌండేషన్ నుండి ఈ భారీ విరాళం సమకూరినట్లు ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురామ్ తెలిపారు. 

►ALSO READ | సరస్వతీ అంత్య పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు

ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఓయూసీఈ (OUCE) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్, వైస్-ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. మంగు, TGEWIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి అనిత, అలుమ్ని అసోసియేషన్ ప్రతినిధి శ్రీ థామస్ రామల, మైనింగ్ ఇంజనీరింగ్ అలుమ్ని అసోసియేషన్ సభ్యులు శ్రీ డి. ఎన్. ప్రసాద్, శ్రీ బిక్కి రమేష్ కుమార్, శ్రీ చిత్తరంజన్ రెడ్డి, డాక్టర్ కె. శ్రీనివాస్, మరియు మైనింగ్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎం. సతీష్ కుమార్, శ్రీ ఇ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  • సింగరేణి కాలరీస్ (SCCL) నుండి రూ. 10 లక్షల ఆర్థిక సాయం

మైనింగ్ ఇంజనీరింగ్ విభాగ భవన నిర్మాణానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాన్ని స్థాపించి, అభివృద్ధి చేయడంలో సింగరేణి సంస్థ అందిస్తున్న విలువైన మద్దతుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్) శ్రీ తాడబోయిన శ్రీనివాస్ ఈ చెక్కును కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేశారు.