ఇరాన్‌లోని నతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి చేశాయి. ఈ దాడిలో అణు కేంద్రం పాక్షికంగా దెబ్బతిన్నది. అమెరికా ఇజ్రాయెల్ దాడులను ధృవీకరించింది ఇరాన్ ప్రభుత్వం. అయితే ఈ దాడిలో ఎటువంటి రేడియేషన్ లీక్ కాలేదని, సమీప నివాసితులకు ఎలాంటి ప్రమాదం లేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.మరోవైపు యుద్దం మొదలైనప్పటి నుంచి ఇరాక్ పై ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ధాడులతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
ఇరాన్‌లోని ప్రధాన అణు ఇంధన శుద్ధి కేంద్రమైన నటాంజ్ (Natanz) పై మరోసారి దాడి జరిగింది. నతాంజ్‌లోని షాహిద్ అహ్మదీ రోషన్ అణు శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ అమెరికా దాడి చేశాయని ఇరాన్ అణుశక్తి సంస్థ తెలిపింది. శనివారం జరిగిన ఈ దాడి అంతర్జాతీయ చట్టాలను, అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (NPT) ,ఇతర అణు భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఇరాన్ పేర్కొంది.యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే దీనిపై దాడి జరగగా, అప్పట్లో వెలువడిన శాటిలైట్ చిత్రాల ప్రకారం పలు భవనాలు దెబ్బతిన్నట్లు కనిపించాయి.
టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అణు కేంద్రంపై, గతంలో జూన్ 2025లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా కూడా దాడులు చేసింది.
మూడు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. అదే సమయంలో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని ప్రధాన చమురు కేంద్రాల దగ్గర కేవలం రెండు గంటల వ్యవధిలోనే 20 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.
