ఇరాన్ ఆయిల్పై అమెరికా ఆంక్షల ఎత్తివేత.. ట్రంప్ అంగీకరించారంటూ ఇరాన్ మీడియాలో వార్తలు

ఇరాన్ ఆయిల్పై అమెరికా ఆంక్షల ఎత్తివేత.. ట్రంప్ అంగీకరించారంటూ ఇరాన్ మీడియాలో వార్తలు
  • తాత్కాలిక మినహాయింపే అంటున్న వాషింగ్టన్
  • రష్యా ఆయిల్​ కొనుగోలుపై మరో నెలపాటు సడలింపు
  • ఆంక్షలున్నా.. లేకున్నా కొంటామన్న ఇండియా

వాషింగ్టన్ / టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చలను కొనసాగించేందుకు అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇరాన్ ఆయిల్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య కుదిరే కొత్త చర్చల ముసాయిదాలో ఇరాన్ చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు అమెరికా మొగ్గు చూపుతోందని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ చర్చల బృందానికి అత్యంత సన్నిహితంగా ఉండే నమ్మకమైన వర్గాలను ఉటంకిస్తూ, ఆ దేశానికి చెందిన ప్రముఖ సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈ వివరాలను బయటపెట్టింది. తస్నిమ్ ప్రచురించిన రిపోర్టు ప్రకారం.. అమెరికా ఇరాన్‌‌పై ఉన్న ఆంక్షలను పూర్తిగా లేదా శాశ్వతంగా ఎత్తివేయడం లేదు. కేవలం ఇరు దేశాల మధ్య తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరిగే కాలానికి మాత్రమే ఇరాన్ చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్లేలా అమెరికా తాత్కాలిక మినహాయింపు లేదా సడలింపును ఇవ్వనుంది. ఇటీవల స్తంభించిపోయిన శాంతి చర్చల్లో ఈ పరిణామం కీలక ముందడుగుగా నిపుణులు చెబుతున్నారు. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్‌‌ను తిరిగి చర్చలకు రప్పించవచ్చని  వాషింగ్టన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే తాటిపైకి ఇరు దేశాల ప్రతిపాదనలు

గతంలో అమెరికా ప్రతిపాదించిన కఠిన నిబంధనలతో పోలిస్తే, ప్రస్తుత కొత్త ముసాయిదాలో ఇరు దేశాల దౌత్యపరమైన డిమాండ్లు ఒకే తాటిపైకి వస్తున్నట్లు ఇరాన్ వర్గాలు సానుకూలత వ్యక్తంచేశాయి. గత నిబంధనల్లో ఉన్న తీవ్రమైన విభేదాలను ఈ కొత్త ముసాయిదా చాలా వరకు అధిగమించిందని వారు పేర్కొన్నారు. అయితే, ఇరాన్ మాత్రం తాత్కాలిక సడలింపుల కంటే ఆంక్షలను శాశ్వతంగా ఎత్తివేయాలనే తమ పాత డిమాండ్‌‌కే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

ట్రంప్ హెచ్చరిక.. ఆ వెనుకే లీకులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ముసాయిదా లీకులు బయటకు రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఇరాన్‌‌ కు మేమిచ్చిన గడువు సమీపిస్తోంది, వారు త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని ట్రంప్ హెచ్చరించిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో తెరవెనుక గట్టి దౌత్య చర్చలు జరుగుతున్నాయనే దానికి ఇది సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్లెయిమ్‌‌ను వాషింగ్టన్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, దీనిపై తీవ్రమైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రష్యా ఆయిల్​పై భారత్​కు  మరో నెల పాటు సడలింపు

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా మరో నెల పాటు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, హార్మూజ్ మూసివేత.. తదితర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా రష్యా నుండి ముడిచమురు దిగుమతులను నిరంతరాయంగా కొనసాగిస్తామని భారత పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. తక్కువ ధరకు లభించే రష్యా చమురు భారత్‌కు కీలక వనరుగా మారింది.