స్టార్లు జోడీలుగా..సరికొత్తగా యూఎస్‌‌ ఓపెన్ మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ ఈవెంట్‌‌

స్టార్లు జోడీలుగా..సరికొత్తగా యూఎస్‌‌ ఓపెన్ మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ ఈవెంట్‌‌
  •     
  •     బరిలో జొకోవిచ్‌, సినర్‌‌‌‌, అల్కరాజ్, రదుకాను, స్వైటెక్‌‌
  •     నేడు, రేపు పోటీలు 

న్యూయార్క్: యూఎస్‌‌‌‌ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌లో ఈ సారి ఆసక్తికరమైన మ్యాచ్‌‌‌‌లు అభిమానులను అలరించనున్నాయి. గతానికి భిన్నంగా ఈ టోర్నీ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ పోటీలతో ఆరంభం కానుంది. మంగళ, బుధవారాల్లో కేవలం రెండు రోజుల్లోనే పోటీలు ముగియనున్నాయి. ఫార్మాట్ కూడా మార్చారు. సెట్‌‌‌‌లో ఆరు గేమ్స్‌‌‌‌కు బదులు నాలుగు గేమ్స్‌‌‌‌ ఉంటాయి. మూడో సెట్‌‌‌‌ను టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తారు. అంతేకాకుండా మెన్‌‌‌‌, విమెన్‌‌‌‌ స్టార్ ప్లేయర్లు జోడీ కట్టి మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ బరిలోకి దిగుతున్నారు.

 యూఎస్‌‌‌‌ ఓపెన్ సింగిల్స్  మాజీ చాంపియన్స్ అయిన కార్లోస్ అల్కరాజ్, ఎమ్మా  రదుకాను జోడీ కట్టారు. ఈ ద్వయం తొలి రౌండ్‌‌‌‌లో టాప్ సీడ్ ద్వయం అయిన జెస్సికా పెగులా– జాక్ డ్రేపర్ ను ఢీకొనబోతోంది. ఇది టోర్నమెంట్‌‌‌‌కే హైలైట్ కానుంది. వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్ కూడా మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌లో ఆడబోతున్నాడు. తొలుత తనకు జోడీగా అనుకున్న ఎమ్మా నవారో తప్పుకోవడంతో  ఇప్పుడు పదిసార్లు డబుల్స్ చాంపియన్ అయిన క్యాథెరినా సినియాకోవాతో జతకట్టాడు.  వీరిద్దరూ తొలి రౌండ్‌‌‌‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్– బెలిందా బెన్సిక్ జంటను ఎదుర్కొంటారు. సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్‌‌‌‌--–ఓల్గా డానిలోవిచ్‌‌‌‌ జోడీ.. మెద్వెదెవ్‌‌‌‌-–మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుండగా.. రెండో సీడ్ ఎలీనా రిబకినా-–టేలర్ ఫ్రిట్జ్‌‌‌‌ ద్వయం.. సారా ఎరానీ–-ఆండ్రియా వవాసోరితో తలపడనుంది.  ఇగా స్వైటెక్‌‌‌‌-–కాస్పర్ రూడ్‌‌‌‌, నవోమి ఒసాకా– గైల్ మోన్‌‌‌‌ఫిల్స్‌‌‌‌, మాడిసన్ కీస్‌‌‌‌– ఫ్రాన్సిస్ తియఫో జంటలు కూడా బరిలో ఉన్నాయి. 

మొత్తంగా 16 జట్లు బరిలో నిలిచిన మిక్స్‌‌‌‌డ్ ఈవెంట్‌‌‌‌లో విన్నర్‌‌‌‌‌‌‌‌కు దాదాపు రూ.8.3 కోట్ల పైచిలుకు ప్రైజ్‌‌‌‌మనీ లభిస్తుంది. అయితే, కొత్త ఫార్మాట్‌‌‌‌పై సింగిల్స్ టాప్ ప్లేయర్లు ఉత్సాహంగా ఉండగా.. రెగ్యులర్ డబుల్స్ ప్లేయర్లు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది ఒలింపిక్స్‌‌‌‌లో హై జంపర్లను కాకుండా, బాస్కెట్‌‌‌‌బాల్ ప్లేయర్లను హై జంప్ పోటీలో ఆడించడం లాంటిది. గ్రాండ్ స్లామ్ డబుల్స్ ట్రోఫీని డబుల్స్ ప్లేయర్లకు కాకుండా, ఇతరులకు ఇవ్వడం వారి క్రీడ నుంచి వారిని దూరం చేయడమే. ఇది అర్థ రహితం’ అని గత ఎడిషన్ విన్నర్ సారా ఎరానీ ఆగ్రహం వ్యక్తం చేసింది.