రష్యన్ ఆయిల్ కొనకపోతే.. ఇండియాకు ఏడాదికి రూ.95 వేల కోట్ల లాస్

రష్యన్ ఆయిల్ కొనకపోతే.. ఇండియాకు ఏడాదికి రూ.95 వేల కోట్ల లాస్
  • క్రూడాయిల్ దిగుమతుల ఖర్చు భారీగా పెరుగుతుంది
  • మిడిల్ ఈస్ట్ నుంచి  కొంటే  రిఫైనరీల లాభాలు పడిపోతాయి: కెప్లర్ రీసెర్చ్‌‌‌‌

న్యూఢిల్లీ: అమెరికా  బెదిరింపుల కారణంగా రష్యన్ క్రూడాయిల్‌‌‌‌ను  కొనడం ఆపేస్తే  ఇండియాకు ఏడాదికి సుమారు రూ.95 వేల కోట్ల (11 బిలియన్ డాలర్ల) నష్టం వస్తుందని   గ్లోబల్ ట్రేడ్ ఎనాలసిస్ కంపెనీ కెప్లర్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించింది. అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 25శాతం టారిఫ్, రష్యన్ చమురు, ఆయుధ కొనుగోళ్లపై జరిమానా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్,  రష్యన్ క్రూడ్ దిగుమతులను గత కొన్నేళ్లలో  భారీగా పెంచుకుంది. 2022లో ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా  వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. తాజాగా ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 35–-40శాతానికి పెరిగింది. దీంతో ఇండియా ఆయిల్ దిగుమతుల ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. ద్రవ్యోల్బణం దిగొచ్చింది.  మార్కెట్ రేటుతో పోలిస్తే రష్యన్ క్రూడాయిల్  తక్కువ రేటుకి దొరుకుతుండడంతో ఈ దేశం నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి.  రిఫైనరీలు రికార్డు లాభాలతో పెట్రోలియం ఉత్పత్తులను ఈయూ వంటి ఇతర దేశాలకు ఎగుమతి చేశాయి. తాజాగా అమెరికా జరిమానా వేస్తామని బెదిరించడం,  యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా 2026 జనవరి నుంచి  రష్యన్ క్రూడ్ నుంచి రిఫైన్ చేసిన ఉత్పత్తులను నిషేధిస్తామని ప్రకటించడంతో ఇండియాపై  ఒత్తిడి పెరుగుతోంది.

రష్యా నుంచి తగ్గుతున్న  దిగుమతులు

కెప్లర్ రిపోర్ట్ ప్రకారం, ఇండియా 2023–24 లో  137 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకుంది. రష్యన్ ఆయిల్‌‌‌‌కు బదులు   మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి  క్రూడ్‌‌‌‌ను కొనుగోలు చేస్తే  ఇండియా ఆయిల్ దిగుమతి ఖర్చు  9-–11 బిలియన్ డాలర్లు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ ధరతో పోలిస్తే రష్యన్ ఆయిల్ రేటు బ్యారెల్‌‌‌‌పై 5 డాలర్ల తక్కువకు దొరుకుతోంది. ఈ డిస్కౌంట్‌‌‌‌ను  కోల్పోతాం.  గ్లోబల్‌‌‌‌గా ధరలు పెరిగితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జులైలో రష్యా నుంచి  చమురు దిగుమతులు 2.1 నుంచి 1.8 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే (బీపీడీ) కి తగ్గాయి. గ్లోబల్‌‌‌‌ రిస్క్‌‌‌‌ల కారణంగా  ప్రైవేట్ రిఫైనర్లు తమ కొనుగోళ్లను తగ్గించుకుంటున్నాయి. 

ఇండియా దిగుమతి చేసుకుంటున్న మొత్తం రష్యన్ ఆయిల్ సగం ప్రైవేట్ రిఫైనర్ల ద్వారానే జరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈయూ ఇప్పటికే నయారా నుంచి పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లను దిగుమతి చేసుకోమని ప్రకటించింది.   ప్రపంచంలో అతిపెద్ద డీజిల్ ఎగుమతిదారు అయిన రిలయన్స్,  రష్యన్ క్రూడ్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడుతోంది.  అమెరికా, ఈయూ హెచ్చరికలతో  రష్యన్ ఆయిల్‌‌‌‌ను తగ్గించడం  లేదా ఉత్పత్తులను ఈయూ నుంచి ఇతర మార్కెట్లకు మళ్లించడం వంటివి చేయాల్సి ఉంటుంది.  దీంతో కంపెనీ లాభాలు పడిపోతాయని అంచనా. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి వీలున్నా, ఒప్పందాలు కఠినంగా ఉండడం, డిస్కౌంట్ లేకపోవడం,  క్రూడ్ క్వాలిటీలో తేడాలుండడంతో  రిఫైనరీలు నష్టపోతాయని కెప్లర్ పేర్కొంది. దిగుమతి ఖర్చులు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని తెలిపింది.