అమెరికాలో గర్భిణిపై పోలీసుల కాల్పులు

అమెరికాలో గర్భిణిపై పోలీసుల కాల్పులు

వాషింగ్టన్‌‌: దొంగతనం చేసిందన్న ఆరోపణలతో నల్ల జాతీయురాలైన ఓ గర్భిణిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఆగస్టు 24న అమెరికాలోని ఓహియో పట్టణంలో ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను షూట్‌‌ చేసిన విజువల్స్‌‌ పోలీసు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ తాజాగా బయటకు రావడంతో విషయం తెలిసింది. 21 ఏండ్ల టాకియా యంగ్‌‌.. ఓ సూపర్ మార్కెట్‌‌ ముందు తన బ్లాక్‌‌ సెడాన్‌‌ కారులో కూర్చొని ఉంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు.. ఆమెను కారు దిగాలని కోరారు. 

తాను కారు దిగనని, అయినా ఎందుకు దిగాలని ఆమె ప్రశ్నించింది. వస్తువులను దొంగిలించిందని పోలీసులు అనడంతో, ఆమె సీరియస్‌‌ అయ్యింది. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని చెబుతూ, కారును ముందుకు పోనిచ్చేందుకు ప్రయత్నించగా, ఓ పోలీసు అధికారి కారు ముందు నిలబడి, గన్‌‌ను బయటకు తీసి ఆమెకు గురిపెట్టాడు. తన కారు ముందు నుంచి పక్కకు జరగాలని ఆ పోలీసుకు చెబుతున్నా.. అతను వినిపించుకోలేదు. దీంతో కారును అలాగే, ముందుకు పోనివ్వడంతో, అతను ఆమెను షూట్‌‌ చేశాడు. 

దీంతో వెంటనే కారు పక్కనే ఉన్న సూపర్‌‌‌‌ మార్కెట్‌‌ పార్కింగ్‌‌ స్థలంలోని గోడను ఢీకొట్టి ఆగిపోయింది. పోలీసులు ఆ కారు వెంటే పరిగెత్తి, డోర్‌‌‌‌ రాకపోవడంతో అద్దాలను పగలగొట్టారు. అప్పటికే యంగ్‌‌కు బుల్లెట్‌‌ తగలడంతో కారు కన్సోల్‌‌పై పడిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌‌కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, యంగ్‌‌కు ఇద్దరు పిల్లలు ఉండగా, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌‌ అని, నవంబర్‌‌‌‌లో డెలివరీ కావాల్సి ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.