- ట్రంప్ బూతు పురాణం.. ఇరాన్ నాయకులపై అసభ్య పదజాలంతో తిట్లు
- హార్మూజ్‌ను వెంటనే తెరవాలని డిమాండ్
- లేదంటే రేపు పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేస్తామని హెచ్చరిక
- ఒక్క ప్రాణం పోకుండా డేరింగ్ ఆపరేషన్ చేశాం
- ఇరాన్ నుంచి తమ పైలట్‌ను రెస్క్యూ చేశామని వెల్లడి
- ఈ ఆపరేషన్‌లో రెండు సొంత విమానాలను పేల్చేసిన అమెరికా
- ఆ విమానాలను తామే కూల్చేశామన్న ఇరాన్
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ససేమిరా అంటున్న ఇరాన్ నాయకులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిట్లతో విరుచుకుపడ్డారు. సహనం కోల్పోయి అసభ్య పదజాలాన్ని వాడారు. హార్మూజ్‌ను ఓపెన్ చేసేందుకు తాను విధించిన పది రోజుల గడువు సోమవారం రాత్రితో ముగిసిందని, వెంటనే హార్మూజ్‌ను తెరవాలని డిమాండ్ చేశారు. ఇరాన్ దిగిరాకుంటే అత్యంత తీవ్రమైన దాడులు తప్పవని హెచ్చరించారు. ‘‘మంగళవారం ఇరాన్‌లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే.. అంతా ఒకే రోజు ఉండబోతోంది. అలాంటిది మీరు ఎప్పుడూ చూసి ఉండరు! బాస్టర్డ్స్.. ఆ జలసంధిని వెంటనే తెరవండి, లేదంటే మీరు నరకాన్ని చూస్తారు.- జస్ట్ వాచ్! అల్లాను ప్రార్ధించండి’’ అని ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. పశ్చిమాసియాలోని అరబ్ దేశాల ఆర్థిక, మౌలిక సదుపాయాలపై దాడులు చేసే విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును కొనసాగిస్తుండటంతో, సోమవారం నాటికి దానిని తెరవకపోతే ‘నరకం’ చూపిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. కాగా, టెహ్రాన్లో జరిగిన ఒక ‘భారీ దాడి’లో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక నాయకులు పలువురు మరణించారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ఒక వీడియోను ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పంచుకున్నారు. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.
ఇరాన్‌లో డేరింగ్ ఆపరేషన్ చేశాం..
ఇరాన్‌లోని పర్వత ప్రాంతంలో శుక్రవారం ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానం కూలిపోయిన తర్వాత మిస్ అయిన పైలెట్‌ను అమెరికా బలగాలు శనివారం రాత్రి క్షేమంగా తీసుకొచ్చాయని ట్రంప్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఆ కల్నల్ స్థాయి వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. తమవైపు ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండానే ఈ డేరింగ్ ఆపరేషన్ పూర్తిచేశామని ట్రంప్ వెల్లడించారు. ‘‘ఇరాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఆయన కోసం వెతుకుతూ చాలా దగ్గరకు చేరుకుంది. ఆయన ఎంతో గౌరవనీయుడైన కల్నల్. ఆయనను రక్షించేందుకు మేం డజన్లకొద్దీ విమానాలను, స్పెషల్ ఫోర్సెస్‌ను పంపాం. మనుషులకు, పరికరాలకు ఉండే ముప్పు కారణంగా ఇటువంటి ఆపరేషన్ కు ఎప్పుడోగానీ ప్రయత్నించరు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఇది సామాన్యంగా జరగదు! మొదటి పైలట్‌ను రక్షించిన తర్వాత, 7 గంటల పాటు ఇరాన్ గగనతలంలో గడిపి ఈ రెండో ఆపరేషన్ చేశాం. అందరి ధైర్యసాహసాలు, ప్రతిభకు ఇది నిదర్శనం! సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు ఓవల్ ఆఫీస్‌లో సైనిక అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిస్తాను. దేవుడు మన గొప్ప సైనిక యోధులను దీవించుగాక!’ అని రాశారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి..
పైలెట్ ఆచూకీ కనుగొనడానికి ముందు, అమెరికా దళాలు ఇప్పటికే ఆయనను చేరుకున్నాయని, భూమార్గం ద్వారా తరలిస్తున్నాయని సీఐఏ ఒక తప్పుడు సమాచారాన్ని ఇరాన్‌లో వ్యాప్తిచేసి అక్కడి అధికారులను గందరగోళానికి గురిచేసినట్టు తెలుస్తోంది. అదేసమయంలో అమెరికాకు చెందిన ఏ-10 అటాక్ విమానాన్ని కూడా ఇరాన్ కూల్చివేసింది. దాని సిబ్బంది పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఇరాన్ ప్రభుత్వ టీవీ మాత్రం తాము ఒక రవాణా విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చివేశామని చెబుతోంది. కానీ సాంకేతిక లోపం వల్ల అమెరికా సైన్యమే తమ విమానాలను పేల్చివేశాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. చీకటిలో మొదలై వెలుతురు వచ్చే వరకు సాగిన ఈ నాటకీయ ఆపరేషన్ అనుకున్నట్లుగా సాఫీగా సాగలేదని
అల్ జజీరా తెలిపింది. అక్కడ ఎదురుకాల్పులు జరిగాయని, ఆ పోరాటం మధ్యలోనే అమెరికా సైన్యం సదరు అధికారిని రక్షించిందని సమాచారం.
శత్రువుల కంటపడకుండా దాక్కుంటూ..
ఇరాన్ కూల్చివేసిన యుద్ధ విమానానికి చెందిన అమెరికా వైమానిక దళ అధికారి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి పర్వత లోయల్లో దాక్కున్నారని, 7,000 అడుగుల ఎత్తు వరకు కాలినడకన ప్రయాణించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రెండు రోజుల పాటు శత్రు భూభాగంలో వారి కంటపడకుండా దాక్కుంటూ కొనసాగించిన ‘జీవన్మరణ’ పోరాటం తర్వాత అమెరికా దళాలు ఆయనను రక్షించాయని తెలిపింది. ‘ఎఫ్-15ఈ నుంచి బయటపడిన తర్వాత ఆ అధికారి పర్వత చీలికల్లో దాక్కున్నారు. 24 గంటల కంటే ఎక్కువ సమయం ఇరాన్ దళాల కంట పడకుండా తప్పించుకున్నారు. ఒక దశలో 7,000 అడుగుల ఎత్తైన పర్వత శిఖరం పైకి వెళ్లారు. ప్రారంభంలో ఆయన ఎక్కడున్నారో అమెరికాకు తెలియదు, కానీ సీఐఏ ఆయన ఆచూకీని కనిపెట్టింది" అని ఉన్నతాధికారులు పంచుకున్న సమాచారాన్ని ఆ పత్రిక వెల్లడించింది. ‘‘ఆ అధికారి దాక్కున్న ప్రాంతానికి ఇరాన్ కాన్వాయ్‌లు రాకుండా ఉండేందుకు అమెరికా విమానాలు బాంబులు వేసి, కాల్పులు జరిపాయి. అమెరికా కమాండోలు కూడా శత్రు దళాలను రక్షణ ప్రాంతానికి దూరంగా ఉంచడానికి కాల్పులు జరిపారు. కానీ నేరుగా ఇరాన్ దళాలతో పోరాటానికి దిగలేదు. వందలాది మంది ప్రత్యేక దళాలు, ఇతర సైనిక సిబ్బంది శత్రు భూభాగంలో పనిచేశారు. నేవీ సీల్ టీమ్ 6 కమాండోలు ఈ వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్‌ను రక్షించారు” అని వివరించింది.
తన విమానాలను తానే పేల్చేసిన అమెరికా
ఇరాన్‌లో కూలిపోయిన యుద్ధ విమాన పైలట్‌ను రక్షించే సాహసోపేతమైన ఆపరేషన్‌లో అమెరికా తన స్వంత విమానాలనే నాశనం చేసుకోవాల్సి వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. శత్రువుల సరిహద్దుల్లోకి రహస్యంగా ప్రవేశించడానికి, అక్కడి నుంచి సిబ్బందిని తీసుకురావడానికి వాడే రెండు ఎంసీ-130జే రవాణా విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే ఆ విమానాలు మిషన్ మధ్యలో మొరాయించాయని.. దీంతో అవి ఇరాన్ చేతికి చిక్కకుండా ఉండటానికిగాను వాటిని పేల్చివేయడం అనివార్యమైందని ఓ అధికారిని ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. అయితే, అమెరికా పైలెట్‌ను రక్షించి తీసుకెళ్లడంపై ఇరాన్ స్పందించలేదు. ఐఆర్జీసీ మాత్రం, అమెరికా గాలింపు
విమానాన్ని తాము ధ్వంసం చేశామని తెలిపింది.
గల్ఫ్ దేశాలపై కొనసాగిన దాడులు
గల్ఫ్ దేశాల్లోని టార్గెట్లపై ఇరాన్ ఆదివారం కూడా దాడులు కొనసాగించింది. కువైట్లో ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్ దెబ్బతిన్నాయి. బహ్రెయిన్‌లోని చమురు సంస్థ నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. యూఏఈలోని రువైస్ పెట్రో కెమికల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచింది. యుద్ధం కోసం నిధులు సమకూరుస్తోందంటూ ఇరాన్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజే ఈ ఘటనలు జరిగాయి. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించారు. అరబ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్‌లో 24 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 19 మంది, అమెరికా సైన్యంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 1,400 మందికి పైగా మరణించగా, 10 లక్షల మంది నిరాశ్రయుల య్యారు.
