ఇండియా, యూఎస్ సంబంధాల్లో కొత్త జర్నీ..ప్రపంచం కోసం రెండు దేశాలు ఏకమైనయ్: మోదీ

ఇండియా, యూఎస్ సంబంధాల్లో కొత్త జర్నీ..ప్రపంచం కోసం రెండు దేశాలు ఏకమైనయ్: మోదీ

వాషింగ్టన్:  ఇండియా, అమెరికా మధ్య సంబంధాల్లో గత మూడు రోజుల్లో కొత్త, కీర్తివంతమైన ప్రయాణం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో మెరుగైన ప్రపంచం కోసం రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడాన్ని ప్రపంచం చూస్తోందన్నారు. అయితే, రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి, శక్తిమంతమైన  భాగస్వామ్యం ఇంకా సాకారం కావాల్సి ఉందన్నారు. శుక్రవారం వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్  బిల్డింగ్​లో ఇండియన్ అమెరికన్లతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై రెండు దేశాలు ఏకతాటిపైకి వచ్చాయని, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడం వల్ల మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ ప్రయత్నాలకు ఊతం లభిస్తుందన్నారు.

 ఇండియా, అమెరికా సంబంధాలు బలోపేతం కావడం వెనక ఇండియన్ ఆరిజిన్ ప్రజల కృషి ఎంతో ఉందని కొనియాడారు.  ఇండియా ఇంత ప్రగతి సాధించడం వెనక దాని ఆత్మ విశ్వాసమే ప్రధాన కారణమని చెప్పారు. వందలాది ఏండ్లుగా బానిసత్వంలో మగ్గిన ఇండియా తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయిందని, కానీ ఇప్పుడు మళ్లీ కొత్త ఇండియా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్​ను తిరిగి పొంది విజయపథంలో ముందుకు వెళ్తోందన్నారు.  

మహిళలందరికీ కమలా హారిస్ స్ఫూర్తి 

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సాధించిన విజయాలు ఇండియా, యూఎస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచాయని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్నా కమల తల్లి డాక్టర్ శ్యామల గోపాలన్ ఇండియాలోని తన మూలాలను మరిచిపోలేదని, ఇండియాతో సంబంధాలను సజీవంగా నిలుపుకొన్నారని ప్రశంసించారు. శుక్రవారం కమలా హారిస్, అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అధికారికంగా ఆతిథ్యమిచ్చిన లంచ్ సందర్భంగా మోదీ మాట్లాడారు. 

ప్రపంచానికి ఇండియా మార్గదర్శి: కమలా హారిస్ 

ఇండియా తన చరిత్ర, ఫిలాసఫీతో ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని కమలా హారిస్ అన్నారు. తన జీవితంలో ఇండియా ఒక ముఖ్య భాగం అని చెప్పారు. ప్రధాని మోదీకి లంచ్ ఆతిథ్యం సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ఇండియాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇండియా చరిత్ర, బోధనలు నాకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి. అవి మొత్తం ప్రపంచాన్నే మార్చేశాయి” అని ఆమె తెలిపారు. అమెరికా అభివృద్ధిలో ఇండియన్ అమెరికన్ ల పాత్ర గణనీయంగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. కాగా, ఇండియా, అమెరికా సంబంధాలు గత రెండున్నరేండ్లలో అత్యవసరమైన భాగస్వాములుగా మారేలా మలుపు తిరిగాయని ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. సెమీకండక్టర్లు, స్పేస్, ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. కాగా, అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ మేరీ మిల్ బెన్ మన ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు.