ఇండో-చైనా బార్డర్ లో పరిస్థితి దారుణం: ట్రంప్

ఇండో-చైనా బార్డర్ లో పరిస్థితి దారుణం: ట్రంప్

న్యూఢిల్లీ: లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి ఇండో-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బార్డర్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని చెప్పారు. ఈ విషయంలో ఇండో-చైనాకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి తాము ఇష్టపతున్నామని, దీనిపై ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇండియాను చైనా బెదిరిస్తుందని తాను అనుకోవడం లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అయితే డ్రాగన్ దూకుడుగా వ్యవహరిస్తోందని, చాలా మంది అంచనాల కంటే వేగంగా, దుందుడుకుగా ముందుకెళ్తోందన్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇండో-చైనా మధ్య సయోధ్య కుదర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ ప్రపోజల్ ను ఇరు దేశాలు సున్నితంగా తిరస్కరించడం గమనార్హం.

ఈ విషయాలను పక్కనపెడితే అధ్యక్ష ఎన్నికల హడావుడిలో ఉన్న ట్రంప్ ఇండియా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడు. ఆయన చాలా బాగా పని చేస్తున్నారు. ఏదీ అంత సులువు కాదు. మాకు ఇండియా నుంచి ప్రధాని మోడీ నుంచి చాలా మద్దతు లభిస్తోంది. ఇండియాకు చెందిన ప్రజలు ఈ ఎన్నికల్లో నాకే ఓటేస్తారని ఆశిస్తున్నా. మహమ్మారి వ్యాప్తికి కొంతకాలం కింద నేను ఇండియాకు వెళ్లా. అక్కడి ప్రజలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నారు. మీకో మంచి లీడర్ ఉన్నారు. ఆయన అద్భుతమైన వ్యక్తి కూడా’ అని ట్రంప్ పేర్కొన్నారు.