
న్యూయార్క్: అమెరికాలోని రిటైల్ షాపుల్లో దొంగతనాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రొడక్టులు ఉన్న షెల్ఫ్‌లకు షాప్‌ల యజమానులు తాళాలు వేస్తున్నారు. రోజువారీగా వాడే టూత్‌పెస్ట్, చాకొలేట్స్, వాషింగ్ పౌడర్, డియోడరెంట్ తదితర ప్రొడక్టులను షెల్ప్‌ల్లో పెట్టి లాక్ చేస్తున్నారు. దేశంలో లివింగ్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో వాటిని కొనలేక చాలా మంది స్టోర్లలో దూరి దొంగతనాలు చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు.
వాల్‌మార్ట్, టార్గెట్, మెడికల్ షాపులు, వాల్‌గ్రీన్స్, హోమ్ డిపో, ఫుట్‌వేర్ తదితర వాటిని తాళాలు వేసి ఉంచుతున్నారు. కొన్నిసార్లు దొంగతనాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని షాప్‌ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో తమ స్టోర్లలో హింస, బెదిరింపులతో కూడిన దొంగతనాలు 120 శాతం పెరిగాయని, దీంతో తామే భారీ నష్టాలను చూస్తున్నామని టార్గెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.