డేంజర్‌‌లో అమెరికా..‘ రోజుకు లక్ష కేసులు నమోదవ్వచ్చు’

డేంజర్‌‌లో అమెరికా..‘ రోజుకు లక్ష కేసులు నమోదవ్వచ్చు’
  • ఆందోళన వ్యక్తం చేసిన ఫౌచీ

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా డేంజర్‌‌ జోన్‌లోకి వెళ్లిపోతోందని ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణుడు అంటోనీ ఫౌచీ అన్నారు. జనం ఇలానే ఉంటే రోజుకు లక్ష కేసులు నమోదయ్యే పరిస్థితి తలెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా జనం వినడం లేదని, మాస్కులు పెట్టకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని అన్నారు. “ ఇప్పటికే రోజుకు దాదాపు 40వేల కేసులు నమోదవుతున్నాయి. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎంత చెప్పినా వినకుండా ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోవడం లేదు. ఈ మహమ్మారి వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తాయో చెప్పలేము. ఆ మరణాలు మనల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి” అని ఆంటోనీ ఫౌచీ అన్నారు. మరోవైపు దీనిపై సీడీసీ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ కూడా స్పందించారు. ప్రజలు కచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలని అప్పుడు వైరస్‌ బారిన పడకుండా ఉంటారని సూచించారు. వైరస్‌ నివారణ బాధ్యతను వ్యక్తితంగా తీసుకోవాలని, నాణ్యమైన మాస్కులను వాడాలని అన్నారు. యూఎస్‌లో ఇప్పటి వరకు దాదాపు 2.6 మలియన్‌ కేసులు నమోదు కాగా.. 1,26,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ చెప్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరవడం కూడా సేఫ్‌ కాదని, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఫౌచీ అన్నారు. వైట్‌ హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌తో మీటింగ్‌ అయిపోయిన తర్వాత ఫౌచీ ఈ విషయాలు వెల్లడించారు.