ఎవరికీ భయపడం.. దేన్నీ వదులుకోం

ఎవరికీ భయపడం.. దేన్నీ వదులుకోం

వాషింగ్టన్: రష్యా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్ సావర్నిటీ, ఇంటిగ్రిటీని దెబ్బ తీస్తోందని ఫైర్ అవుతున్నాయి. ఉక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించిన ఉక్రెయిన్ లోని ప్రాంతాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన అమెరికా.. రష్యాపైనా ఆంక్షలు తప్పవని ప్రకటించింది. బ్రిటన్, జపాన్, జర్మనీ సహా మరికొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తామన్నాయి. 

  • రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించిన ఉక్రెయిన్ లోని రెండు ప్రాంతాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని, బిజినెస్ చేయబోమని అమెరికా ప్రకటించింది. ఈమేరకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
  • రష్యా తీరును జపాన్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ సావర్నిటీని దెబ్బ తీస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మండిపడ్డారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
  • రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఆయన ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించారు. 
  • రష్యా తీరును ఖండిస్తూ జర్మనీ చర్యలు చేపట్టింది. రష్యా నుంచి జర్మనీకి నేచురల్ గ్యాస్ తీసుకొచ్చేందుకు చేపట్టనున్న ‘‘నార్డ్ స్ట్రీమ్ 2” పైప్ లైన్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 
  • రష్యా దూకుడుగా వ్యవహరిస్తోందని న్యూజిలాండ్ ఫారిన్ మినిస్టర్ ననాయ్ మాహుతా మండిపడ్డారు. పొరుగు దేశాలను రష్యా భయపెడుతోందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఫైర్ అయ్యారు. రష్యా నిర్ణయాన్ని ఖండిస్తున్నామని, దాన్ని తిరస్కరిస్తున్నామని టర్కీ పేర్కొంది.

ఎవరికీ భయపడం.. దేన్నీ వదులుకోం: ఉక్రెయిన్

రెండు ప్రాంతాల స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటన చేశాక.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్‌‌స్కీ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మేం ఎవరికీ భయపడటం లేదు. మేం ఎవరికీ బాకీ లేం. అలాగే ఎవరికీ, దేన్నీ ఇవ్వబోం” అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలు తమకు మద్దతు ఇవ్వాలని జెలెన్‌‌స్కీ కోరారు. ‘‘మా నిజమైన స్నేహితుడు, భాగస్వామి ఎవరో ఇప్పుడు చూడటం చాలా ముఖ్యం. కేవలం మాటలతోనే రష్యన్ ఫెడరేషన్‌‌ను భయపెట్టేవాళ్లు ఎవరనేది తెలుసుకోవాలి” అని కామెంట్లు చేశారు. జర్మనీ, రష్యా మధ్య చేపట్టిన కీలక ‘నార్డ్ స్టీమ్ 2 ప్రాజెక్ట్‌‌’ను వెంటనే నిలిపివేయాలని జెలెన్‌‌స్కీ డిమాండ్ చేశారు. ఇందుకు వెస్ట్రన్ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉక్రెయిన్‌‌పై పెద్ద మిలటరీ దాడికి రష్యా మార్గం సుగమం చేసుకుంటోందని ఆరోపించారు. మరోవైపు మంగళవారం వాషింగ్టన్‌‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌‌తో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా భేటీ అయ్యారు.