మూర్చ మందుతో క్యాన్సర్​కు చెక్

మూర్చ మందుతో క్యాన్సర్​కు చెక్
  • మూర్చ మందుతో క్యాన్సర్​కు చెక్
  •     ఇండియన్ సైంటిస్ట్ బృందం పరిశోధనలో వెల్లడి
  •     బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్‌‌మెంట్​లో కీలక ముందడుగు

 

శాన్​ఫ్రాన్సిస్కో:  బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్‌‌మెంట్ లో కీలక ముందడుగు పడింది. మూర్చ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుతో బ్రెయిన్ క్యాన్సర్​కు చెక్ పెట్టొచ్చని ఇండియన్ సైంటిస్ట్ సరిత కృష్ణ ఆధ్వర్యంలోని బృందం కనుగొంది. తిరువనంతపురానికి చెందిన సరిత కృష్ణ అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ లో సైంటిస్ట్​గా పని చేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని టీం బ్రెయిన్ క్యాన్సర్​లలో అతి ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా వ్యాధిపై జరిపిన పరిశోధనలో కీలక విజయం సాధించింది.

గ్లియోబ్లాస్టోమా రోగులలో క్యాన్సర్ కణాలు ఆరోగ్యవంతమైన బ్రెయిన్ సెల్స్​తో లింక్ అయి వాటిని కూడా క్యాన్సర్ సెల్స్​గా మారుస్తాయి. ఈ వ్యాధిలో క్యాన్సర్ సెల్స్ హైపర్ యాక్టివ్​గా మారడంతో పేషెంట్లకు మెమరీ, కొత్త విషయాలు నేర్చుకునే శక్తి, రోజువారీ పనుల్లో నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలు చాలా వేగంగా నశిస్తాయి. చివరకు రోగి మరణించే పరిస్థితి వస్తుంది. అయితే, మూర్చ వ్యాధి నివారణకు వాడే గాబాపెంటిన్ అనే మందు(యాంటీ సీజర్ డ్రగ్) ఈ వ్యాధిని కూడా అడ్డుకోగలదని తమ పరిశోధనలో తేలినట్లు సరిత కృష్ణ తెలిపారు. గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ కణాలు హైపర్ యాక్టివ్​గా మారకుండా ఈ మందు అడ్డుకుంటుందని, ట్యూమర్ పెరుగుదలను ఆపేస్తుందని తాము కనుగొన్నామని తెలిపారు.