ముగింపు దిశగా అమెరికా షట్డౌన్.. తిరిగి విధుల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు

ముగింపు దిశగా అమెరికా షట్డౌన్.. తిరిగి విధుల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు

వాషింగ్టన్: అమెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ ‘షట్​డౌన్’ త్వరలో ముగిసిపోనుంది. సెనేట్‎లో ఆదివారం జరిగిన ఫస్ట్ ఓటింగ్‏లో ప్రభుత్వానికి అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా-40 ఓట్లు వచ్చాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన డీల్‎కు మద్దతు దక్కడంతో ప్రభుత్వానికి జనవరి 30వ తేదీ వరకు ఫండ్స్ రిలీజ్ చేసుకునేందుకు అనుమతి లభించింది. అలాగే మూడు ముఖ్యమైన వినిమయ బిల్లులకు ఆర్థిక సంవత్సరం మొత్తం నిధులు కేటాయింపు సుగమమైంది. 

ఈ మూడు బిల్లుల్లో ఆహార సాయం(ఫుడ్​ఏయిడ్), మిలటరీ వెటరన్స్ కార్యక్రమాలు, శాసన శాఖకు నిధులు ఉన్నాయి. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. అయితే షట్‌‌డౌన్ పూర్తిగా ముగిశాక మాత్రమే వాళ్లకు జీతాలు ఇవ్వనున్నారు. సెనేట్‎లో మెజారిటీ పక్ష నేత జాన్ థ్యూన్ దీన్ని స్వాగతించారు. 

‘‘షట్‌‌డౌన్ వల్ల దేశమంతా విమానాలు ఆగిపోయాయి. కోట్ల మందికి ఆహార సాయం ఆలస్యమైంది. లక్షల ఉద్యోగులు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నరు. మనం దీన్ని ఇప్పుడే ముగించాలి” అని థ్యూన్ అన్నారు. డెమొక్రాట్ లీడర్ చక్ షుమర్ మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. ‘‘ఆరోగ్య రంగ సమస్యలు పరిష్కరించకుండా నేను దీన్ని సమర్థించలేను” అని ఆయన అన్నారు. అయితే ఎనిమిది మంది డెమొక్రాట్లు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

మరికొన్ని రోజులు ఇబ్బందే

షట్​డౌన్ పూర్తిస్థాయిలో ముగియడానికి ఇంకా కొన్ని అడుగులు పడాల్సి ఉంది. అందుకోసం సెనేట్‎లో ఇంకా మిగిలిన డిస్కషన్స్, ఫైనల్ ఓటు అనుకూలంగా పూర్తవడంతో పాటు ఆ తర్వాత హౌస్‌‌లో బిల్లు పాసస్​కావాల్సి ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఇంకొన్ని రోజులు పట్టే చాన్స్ ఉంది. అప్పటి వరకు ప్రభుత్వం, ప్రజలకు ఇబ్బందులు కొనసాగనున్నాయి. విమాన, రోడ్డు ప్రయాణాలు ఆలస్యమవుతాయి. 

సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయి. కోట్లాది మంది ఆరోగ్య బీమా ఖర్చులు పెరుగుతాయి. ఆదివారం 2 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. ఏడు వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. థాంక్స్‌‌ గివింగ్ డే(నవంబర్​27వ తేదీ) సమయానికి విమానాల ఆలస్యం మరింత పెరిగే పరిస్థితి ఉందని అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ చెప్పారు. అలాగే 2.5 కోట్ల మందికి ఆహార సాయం నిలిచిపోయిందన్నారు. షట్‌‌డౌన్ ముగిస్తేనే ఈ ఇబ్బందులు అన్ని తీరనున్నాయి.