6 రోజుల్లోనే అమెరికాకు లక్ష కోట్ల ఖర్చు..మరిన్ని నిధుల కోసం కాంగ్రెస్ ముందుకు వైట్ హౌస్

6 రోజుల్లోనే అమెరికాకు లక్ష కోట్ల ఖర్చు..మరిన్ని నిధుల కోసం కాంగ్రెస్ ముందుకు వైట్ హౌస్
  • మరిన్ని యుద్ధ నిధుల కోసం కాంగ్రెస్ ముందుకు వైట్ హౌస్
  • యుద్ధం ఇంకెంత కాలమంటూ ట్రంప్‌‌‌‌ను నిలదీసిన డెమొక్రాట్లు

వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌పై యుద్ధం చేయడానికి అమెరికాకు రోజురోజుకు ఖర్చు పెరుగుతున్నది.వార్ మొదలైన మొదటి ఆరు రోజులకే అమెరికాకు 11.3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లకు పైగా) ఖర్చు అయినట్లు ట్రంప్ సర్కార్ అంచనా వేసింది.గురువారం సెనేటర్లతో అధికారులు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ మీటింగులోనే అధికారులు యుద్ధానికి చేస్తున్న ఖర్చు వివరాలను వెల్లడించారు. 

అధికారుల ప్రకారం..  ఇరాన్‌‌‌‌పై మొదటి రెండు రోజుల వైమానిక దాడులకే 5.6 బిలియన్ డాలర్ల(రూ.51,677 కోట్లు) విలువైన మందుగుండు సామగ్రిని ఉపయోగించినట్లు సమాచారం. యుద్ధం కొనసాగించడానికి వైట్ హౌస్ త్వరలోనే కాంగ్రెస్ నుంచి అదనంగా 50 బిలియన్ డాలర్ల(రూ.4.61లక్షల కోట్లు) నిధులను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాణ నష్టం కూడా ఎక్కువే..

ఈ యుద్ధం కేవలం ఆర్థికంగానే కాకుండా ప్రాణ నష్టాన్ని కూడా పెంచుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటివరకు సుమారు 2,000 మంది ఇరాన్, లెబనాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 

మరోవైపు, అమెరికా రక్షణ నిల్వలు ఖాళీ అవుతున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  యుద్ధం ఇంకెంత కాలం కొనసాగుతుంది? యుద్ధం తర్వాత ఇరాన్ విషయంలో ట్రంప్ ప్రణాళిక ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ట్రంప్ సర్కారును డెమొక్రాటిక్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.