ట్రంప్ టారిఫ్లు చెల్లవ్.. విదేశాలపై పన్నులు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు

ట్రంప్ టారిఫ్లు చెల్లవ్.. విదేశాలపై పన్నులు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు
  • సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్​దేనని వెల్లడి
  • ఆ అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసిన కోర్టు
  • రీఫండ్ విషయంపై ఎటూ తేల్చని న్యాయమూర్తులు
  • భారత ఎగుమతులకు ఈ తీర్పు పెద్ద ఊరట

వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవంటూ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం విదేశాలపై భారీగా టారిఫ్స్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఆ అధికారం కేవలం అమెరికన్ కాంగ్రెస్ ‘పార్లమెంట్’ కు మాత్రమే ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్స్ ను రద్దు చేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టు షాకిచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ తన ఆర్థిక విధానాల్లో 'గ్లోబల్ టారిఫ్స్' అత్యంత కీలకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో భాగంగా దిగుమతులపై ఆయన 'ప్రతీకార సుంకాలు’ విధించారు. 

టారిఫ్ లు విధిస్తానని బెదిరించి పలు యుద్ధాలను కూడా ఆపినట్లు ట్రంప్ పలుమార్లు వెల్లడించారు. ట్రంప్ ఎంతో కీలకంగా భావించే ఈ టారిఫ్ లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం 6-3 మెజారిటీ తో వాటిని కొట్టివేసింది. అయితే, టారిఫ్​ల పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన కోట్లాది డాలర్లను కంపెనీలకు తిరిగి చెల్లించడంపై  సుప్రీం ఎటూ తేల్చలేదు.

తీర్పులోని ముఖ్యాంశాలు ఇవే..
1977 నాటి 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' అధ్యక్షుడికి పన్నులు లేదా సుంకాలు విధించే అధికారాన్ని ఇవ్వదని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం కేవలం ‘కాంగ్రెస్’కు మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని కార్యనిర్వాహక శాఖ (అధ్యక్షుడు) తీసుకోవడానికి వీల్లేదని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు.

ట్రంప్ నియమించిన బ్రెట్ కావనోతో పాటు జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్ ఈ తీర్పుతో విభేదించారు. అయితే, వ్యతిరేకంగా ఆరుగురు జడ్జీలు, అనుకూలంగా ముగ్గురు జడ్జీలు మొగ్గుచూపడంతో టారిఫ్ లు చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

రీఫండ్‌పై సందిగ్ధత..
ఈ అత్యవసర చట్టం కింద ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 133 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 లక్షల కోట్లు) సుంకాలను వసూలు చేసింది. ఇప్పటికే  కాస్ట్ కో వంటి దిగ్గజ సంస్థలు తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించాయి. అయితే, ఈ భారీ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లించాలనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఇది భవిష్యత్తులో పెద్ద గందరగోళానికి దారితీయవచ్చని జస్టిస్ కావనో హెచ్చరించారు.

భారత్కు ఊరట..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు మరియు ఐటీ సేవలకు ఈ తీర్పు పెద్ద ఊరట. గతంలో భారత ఎగుమతులపై ట్రంప్  50% సుంకాలు విధించారు. ఆపై రష్యా చమురు కొనుగోలు తగ్గించడంతో వాటిని 18 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మళ్ళీ పాత ధరలకే పోటీ పడే అవకాశం లభించనుంది.